సాధారణంగా ప్రతి ఒక్కరు రోజూ స్నానం చేసి శుభ్రంగా ఉంటారు. అయితే కొందరు మాత్రం రోజూ మార్చి రోజూ స్నానం చేస్తారు. కానీ ఎవరు స్నానం చేయకుండా మాత్రం ఉండరు. స్నానం చేయకుండా ఎవరైన కనీసం రెండు, మూడు రోజులు ఉండగలరా?. ఉహించుకుంటేనే ఎలానో ఉంది కదా?. అయితే ఓ వ్యక్తి స్నానం చేయకుండా వారం, నెల , సంవత్సరం కాదు.. ఏకంగా 67 ఏళ్లుపైగా ఉన్నాడు. అతడే హాజి. ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా ఇరాన్ కు చెందిన అమౌ హాజీ(94)కి గుర్తింపు ఉంది. అయితే 67 ఏళ్ల తరువాత ఇటీవల కొద్ది నెలల క్రితం స్నానం చేశారు. స్నానం చేసిన నెలల వ్యవధిలోనే ఆయన కన్నుమూశారు. ఆయన మరణించినట్లు ఇరాన్ అధికారిక వార్త సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడిచింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇరాన్ లోని సౌత్ స్టేట్ అయిన ఫార్స్ లోని డెజ్గా అనే గ్రామం అమౌ హాజీ నివాసం ఉండేవారు. స్వచ్ఛత అనే పదానికి హజీ ఆమడ దూరంలో ఉండేవారు. శుభ్రత అనే పదం తనకు నచ్చదని పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సమయంలో తెలిపారు. తనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఎంతో శుభ్రంగా ఉండే వాడినని, అయినా ఏదో ఒక అనారోగ్యం వెంటాడిందని, అందుకు కారణం తాను పరిశుభ్రతగా ఉండటమేని గ్రహించినట్లు తెలిపాడు. ఇక అప్పటి నుంచి ఆయన స్నానం చేయడం మానేశారు. శుభ్రత అనే పదానికి దూరంగా ఉండి, అపరిశుభ్రతను అక్కున చేర్చుకున్నారు. అగ్నిజ్వాలతో హెయిట్ కట్ చేసుకునే పద్దతిని ఆరు దశాబ్ధాలుగా ఉపయోగించారు. రోజుకు 5లీటర్ల నీటిని తాగుతారు. ఆ తాగే నీటిని సైతం మురికిగా ఉన్న డబ్బాలోనే నిల్వ చేసుకునేవారు.
తన దుస్తువులు, తినే ఆహారం అన్ని అపరిశుభ్రంగా ఉండేవి. శుభ్రత పాటించకపోయిన హాజీ ఎంతో ఆరోగ్యంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేది. ఇక ఆయన కుటుంబ విషయానికి వస్తే.. ఆయనకంటూ ఎవరూ లేరూ. వివాహం చేసుకోలేదు, స్నేహితులు లేరు. స్మోకింగ్ చేస్తూ విశ్రాంతి తీసుకునే వారు. అలా అనారోగ్యానికి గురవుతాననే భయంతో దాదాపు 67 ఏళ్లకుపైగా స్నానం చేయకుండా హాజీ ఎంతో ఆరోగ్యంగా జీవించారు. అయితే ఇటీవల కొద్ది నెలల క్రితం స్థానికులు హాజీకి బలవంతంగా బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి స్నాం చేయించారని ఇరాన్ అధికారికా మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. దీంతో స్నానం చేసిన నెలల వ్యవధిలోనే ఆయన తుదిశ్వాస విడిచారని ఆ సంస్థ పేర్కొంది.
హాజీ జీవితంపై ‘ ద స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హాజీ’ అనే డాక్యూమెంటరీ సైతం తీశారు. అత్యధి కాలం స్నానం చేయని వ్యక్తిగా హాజీకి ప్రపంచ రికార్డు ఉంది. గతంలో ఈ రికార్డు కైలాశ్ సింగ్ అనే వ్యక్తి పేరిట ఉండేది. దానిని హాజీ రెండున్నర దశాబ్దల కిందటే బద్దలు కొట్టాడు. 67 ఏళ్లకు పైగా స్నానం చేయకుండానే జీవించిన 94 ఏళ్ల హాజీ ఇకలేరు. అపరిశుభ్రత సామ్రాజ్యానికి రారాజు అయిన అమౌ హాజీ ఇకలేరనే వార్త చాలా మందిని బాధించింది.