ఈ మధ్యకాలంలో కొన్ని సంస్థలు ఉద్యోగులను వదిలించుకునేందుకు సాకులు వెతుకుతున్నాయి. ఉద్యోగి ఎక్కడ పొరపాటు చేసి దొరుకుతాడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక ఏమి దొరకనప్పుడు చిన్న చిన్న పొరపాట్లనే పెద్దవి గా చూపించి ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. అయితే అలా చేసే సందర్బంలో వారు చేస్తున్న తప్పులు వారి మెడకే చుట్టుకుంటున్నాయి. తాజాగా ఓ కంపెనీకి అలానే జరిగింది. చిన్నకారణంతో ఉద్యోగిపై వేటు వేసినందుకు సదరు కంపెనీకి కోర్టు రూ.60 లక్షల భారీ జరిమాన విధించింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో కొందరు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈక్రమంలోనే సదరు కంపెనీలు అత్యుత్సాహాన్ని ప్రదరిస్తున్నాయి. చిన్న పొరపాట్లకే ఉద్యోగులను జాబ్ నుంచి తొలగించి రోడ్డుపై పడేస్తున్నాయి. నెదర్లాండ్స్ లో ఏర్పాటు చేసిన ఓ అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీ.. జనవరి 2019 ఓ వ్యక్తిని నియమించుకుంది. అతడికి జీతం, కమిషన్, బోనస్, ఇతర అలవెన్స్ లు కలిపి ఏడాదికి 70వేల యూరోలను .. మన కరెన్సీలో దాదాపు రూ.60 లక్షలను చెల్లిస్తుంది. అలా ఆ కంపెనీలో సదరు ఉద్యోగి ఏడాదికి పైగా వర్క్ చేస్తూ వస్తున్నాడు. అతడికి జీతం ఎక్కవ ఇస్తున్నమని భావించిన కంపెనీ ఉద్యోగం నుంచి తప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ ఉద్యోగిని ‘ కరెక్టివ్ యాక్షన్ ప్రోగ్రామ్’ వర్చ్యువల్ ట్రైనింగ్ లో పాల్గొనాలని ఆదేశించింది.
ఎప్పుడూ వెబ్ కెమెరా ఆన్ చేసి పెట్టాలని తెలిపింది. అలా ప్రతి రోజూ 9 గంటల పాటు ఉద్యోగిని మానిటర్ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ ఆదేశాలను సదరు ఉద్యోగి తిరస్కరించాడు. రోజుకి 9 గంటల పాటు కెమెరాను ఆన్ లో ఉంచడం తనకు ఇబ్బందిగా ఉందని ఉద్యోగి తెలిపాడు. తన వ్యక్తిగత విషయానికి భంగం కలిగిస్తుందని కంపెనీ ఆదేశాలను తిరష్కరించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కంపెనీ.. ఆ ఉద్యోగిపై వేటు వేసింది. అయితే తనపై అన్యాయంగా వేటు వేశారంటూ నెదర్లాండ్ లోని స్థానిక కోర్టుని ఆశ్రయించాడు. ఆ కంపెనీ తనతో ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆవేదన చెందాడు.
ఉద్యోగి పిటిషన్ స్వీకరించిన కోర్టు.. విచారణ ప్రారంభించింది. కొన్నాళ్ల పాటు విచారణం సాగింది. చివరకు కోర్టు ఉద్యోగికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పని చేసేందుకు ఉద్యోగి నిరాకరించినట్లు ఎక్కడ ఆధారాలు లేవని కంపెనీ వాదనలు కోర్టు కొట్టివేసింది. అదే విధంగా ఉద్యోగిని వెబ్ క్యామ్ ఆన్ లో పెట్టుకోమనడం అతడి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించినట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. అన్యాయంగా ఉద్యోగిపై వేటు వేసినందుకు కంపెనీకి రూ.60 లక్షల జరిమానా విధించింది. అయితే ఉద్యోగిపై ఆ కంపెనీ వేసిన వేటు.. వారికే చేటు తెచ్చిపెట్టింది.