పాక్ లో దుర్భర పరిస్థితులు. చికెన్ నుంచి పాల వరకు.. పిండి నుంచి ఉల్లిపాయల వరకు అన్ని రకాల వస్తువుల రేట్లు వందలు, వేలల్లోనే.. కొద్దిరోజుల కిందట లైవ్ బ్రాయిలర్ చికెన్ రేటు వరకు కిలోకు రూ.370గా ఉండగా.. ఇప్పుడది రూ.800పైకి చేరిందంటేనే అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.
దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతకంతకు దిగజారిపోతోంది. నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ నుంచి పాల వరకు.. పిండి నుంచి ఉల్లిపాయల వరకు అన్నింటి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు ఉద్యోగ, ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. లక్షలాది కుటుంబాలు రోజుకు ఒక పూట ఆహారంతోనే బతకాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఖాళీ కడుపుతో చిన్నారులు అల్లాడుతున్నారు. వేలాదిమంది కూలీలు పనుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే.. త్వరలో పాకిస్తాన్ మరో శ్రీలంక అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
పాక్ విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోయాయి. గతేడాది జనవరిలో 16.6 బిలియన్ డాలర్లున్న పాక్ విదేశీ మారక నిల్వలు.. ఇప్పుడు 4 బిలియన్ డాలర్లకు లోపు పడిపోయాయంటేనే అక్కడి పరిస్థితి ఏంటన్నది అర్థమవుతోంది. ముడిచమురుపై పాక్ ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడడం, వాటి ధరలు విపరీతంగా పెరగడం, పాకిస్థాన్ రూపీ విలువ పతనమవ్వడం వంటి కారణాలు విదేశీ మారక నిల్వలు తరిగిపోవడానికి కారణమైంది. ఫలితంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. కూరగాయలు, గ్యాస్, పాలు, గోధుమలు, నాన్- వెజ్.. ఇలా అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటేశాయి. కొద్దిరోజుల క్రితం గోధుమ పిండి కోసం జనాలు ట్రక్కులపైనే దోచుకెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు.
ఇక పాక్ లో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే.. నెలవారీగా ఉద్యోగులకు వేతనాలు పక్కనపెడితే, పదవీ విరమణ పొందినవారికి దక్కాల్సిన ప్రయోజనాలు అందక సంవత్సరం దాటిందట. గ్రాట్యుటీలు,పెన్షన్ రూపంలో కోట్లల్లో చెల్లించాల్సి ఉన్నా.. ఇవ్వడానికి వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదట. ఎలక్ట్రిసిటీ రంగంలోనూ అదే దుస్థితి. అవసరం లేని సమయాల్లో లైట్లు ఆర్పేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. కేబినెట్ మీటింగ్‌ల్లోనూ లైట్లు ఆర్పేసి నిర్వహిస్తుండటం గమనార్హం. మార్కెట్లు, మాల్స్, ఫంక్షన్ హాల్స్ ఇతరత్రా వాటిని త్వరగా మూసేస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి పాకిస్తాన్ అన్నింటా ఒడిదుడుకులనే ఎదుర్కొంటోంది. వీటి నుంచి భయటపడటానికి ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తోందట. రాబోయే మరికొన్ని నెలలు పాకిస్థాన్లో గడ్డు పరిస్థితులు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.