నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలు సొంత దేశ ప్రజల ప్రాణాలతో పాటు పొరుగు దేశాల వాసులనూ ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన పనికి లక్షలాది మంది ప్రాణాలకు రిస్క్ ఏర్పడిందని ఓ అధ్యయనం వెల్లడించింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలిసిందే. అభినవ నియంతగా చెప్పుకునే కిమ్.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు.. ఇలా ప్రతిదీ సంచలనమే. అలాంటి కిమ్ వరుసగా అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన అణుసామర్థ్యం కలిగిన దేశంగా నార్త్ కొరియాను నిలపాలనుకుంటున్న కిమ్ కోరిక.. సొంత ప్రజలనే కాదు, పొరుగు దేశాల జనాలనూ భయపెడుతోంది. ఉత్తర కొరియాలోని ‘పుంగేరి’ భూగర్భ అణుపరీక్షా కేంద్రం కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఓ మానవ హక్కుల సంఘం తాజా అధ్యయనంలో తేలింది.
ప్రజలకు రేడియోధార్మికత ముప్పు పొంచి ఉందని సియోల్ ఆధారిత ఓ మానవ హక్కుల సంఘం తెలిపింది. ప్యాంగ్యాంగ్ ఏడో అణు పరీక్షకు రెడీ అవుతోందని వార్తలు వస్తున్న వేళ ఈ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా, సౌత్ కొరియా నివేదికల ప్రకారం.. నార్త్ కొరియా 2006–17 మధ్యకాలంలో ఉత్తర హమ్‌గ్‌యాంగ్ ప్రావిన్స్‌లోని పుంగేరి సైట్లో రహస్యంగా ఆరు అణ్వాయుధ పరీక్షలు జరిపింది. దీంతో ఇక్కడి నుంచి భూగర్భ జలాల ద్వారా రేడియోధార్మిక పదార్థాలు ప్రస్తుతం స్థానికంగా ఎనిమిది సిటీలు, కౌంటీల్లోకి విస్తరించి ఉండొచ్చని తాజా అధ్యయనం అంచనా వేసింది.
ఈ ప్రాంతాల్లో దాదాపుగా 10 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. వీళ్లతో పాటు ఉత్తర కొరియా నుంచి పొరుగున ఉన్న సౌత్ కొరియా, చైనా, జపాన్‌లకు అక్రమంగా రవాణా అయ్యే వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల కారణంగా.. అక్కడి ప్రజలూ కొంతమేర ప్రమాదంలో పడే చాన్స్ ఉందని నివేదిక హెచ్చరించింది. మరోవైపు.. భూగర్భ జలాల కలుషితాల ఆరోపణలను ఉత్తర కొరియా కొట్టిపారేస్తూ వస్తోంది. అణు పరీక్షల తర్వాత ఎలాంటి హానికరమైన పదార్థాలు లీక్ కాలేదని అంటోంది. మరోవైపు సొంత దేశ ప్రజల ప్రాణాలతో పాటు ఇతర దేశాల వాసులనూ భయపెడుతున్న కిమ్ నిర్ణయాలపై అంతటా విమర్శలు వస్తున్నాయి.