న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. తన మార్క్ పాలనతో మంచి పేరు తెచ్చుకున్న జెసిండా షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో న్యూజిలాండ్‌తోపాటు ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. న్యూజిలాండ్ మీద అత్యంత దారుణంగా జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె పాటించిన సంయమనం, కరోనా కల్లోల పరిస్థితులను ఎదుర్కొన్న తీరు ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. అలాంటి జెసిండా హఠాత్తుగా రాజీనామా చేయడం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఆమె మాత్రం ప్రధాని బాధ్యతల నుంచి తాను తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని స్పష్టం చేశారు.
‘నేనూ ఓ మనిషినే. ఏదైనా మనం చేయగలిగినంత కాలమే చేస్తాం. ఆ తర్వాత ఒక సమయం వస్తుంది. ఇప్పుడు నా టైమ్ వచ్చింది. ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది ఎంతో ఉన్నతమైంది. అదే సమయంలో ఎన్నో సవాళ్లతో కూడుకున్నది కూడా. ప్రభుత్వాన్ని నడిపేంత సామర్థ్యం పూర్తిస్థాయిలో లేనప్పుడు ఆ పదవిలో కొనసాగడం సరికాదు’ అని జెసిండా పేర్కొన్నారు. మీరు నాయకత్వం వహించేందుకు సరైన వ్యక్తా.. కాదా అని తెలుసుకోవడం కూడా ఒక బాధ్యతేనని ఆమె చెప్పుకొచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలవలేదని భావించడం వల్లే తాను ఈ పదవిని వీడటం లేదన్నారు. వచ్చే ఎలక్షన్స్‌లో లేబర్ పార్టీ పక్కాగా విజయం సాధిస్తుందని తాను నమ్ముతున్నానని జెసిండా వ్యాఖ్యానించారు. తన రాజీనామా వెనక ఎలాంటి రహస్యం లేదని ఆమె వివరించారు.