John Cena: డబ్ల్యూడబ్ల్యూఈ షో ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘జాన్ సెనా’. ఈయనకు పిల్లల్లో చాలా ఫాలోయింగ్ ఉంది. ఇక, రింగ్‌లో ప్రత్యర్థులను రఫ్పాడించే జాన్ సెనా.. తనను ఎంతగానో అభిమానించే పిల్లల పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు. ఆ ప్రేమను అవసరం ఉన్నపుడు ప్రదర్శిస్తుంటారు. ఇదే ఆయన్ని ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. అత్యధిక మంది పిల్లల కోర్కెలు తీర్చిన రెస్లర్‌గా గిన్నిస్ రికార్డుకు ఎక్కేలా చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. అమెరికాకు చెందిన రెస్లర్ జాన్ సెనా 2002నుంచి ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నారు.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే పిల్లల కోర్కెలను తీరుస్తూ వస్తున్నారు. తనను కలవాలనుకునే.. సరదాగా కాసేపు గడపాలనుకునే పిల్లలను ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు. ఇప్పటి వరకు 650 మంది పిల్లల కోర్కెల్ని ఆయన తీర్చారు. 2.5నుంచి 18 సంత్సరాలు కలిగిన వారు ఆ జాబితాలో ఉన్నారు. ఇలా ఏ రెస్లర్ ఇప్పటి వరకు చేయలేదు. ఎవ్వరూ కూడా 200లకు మించి ఎక్కువ కోర్కెలను తీర్చలేకపోయారు. కానీ, జాన్ సెనా ఏకంగా 650 మంది పిల్లల కోర్కెల్ని తీర్చాడు. దీంతో ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కింది.
గతంలో ‘మేక్ ఏ విష్’’లో భాగం కావటంపై జాన్ సెనా మాట్లాడుతూ.. ‘‘ నా అవసరం ఉన్నపుడు నేను మీ దగ్గర ఉంటా. నేను ఎంత బిజీలో ఉన్నా సరే. ఎందుకంటే ఇది నాకు ఎంతో ఇష్టం. ఆ అద్భుతమైన క్షణాల కోసం ఏమైనా చేస్తా. ఎప్పుడూ ముందు వరుసలో ఉండాలనుకుంటా’’ అని పేర్కొన్నాడు. కాగా, జాన్ సెనా 1999లో డబ్ల్యూడబ్ల్యూఈ షోలోకి అడుగుపెట్టాడు. రెస్లర్‌గా మారిన రెండు సంవత్సరాలనుంచే మేక్ ఏ విష్ ఫౌండేషన్‌తో పనిచేస్తున్నారు. 2002లో ఈ ప్రయాణం మొదలైంది. దాదాపు 20 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతోంది.