ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే ఓ బలమైన కోరిక ఉంటుంది. అయితే కొందరికి మాత్రం సొంత ఇల్లు నగరాల్లో ఉండే బాగుంటుందనే అభిప్రాయం ఉంటుంది. ఇలా భారీగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ నగరాల్లో ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్ల కొనుగోలు విషయంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. చాలా మంది భారతీయులు.. ఇండియాలో కాదని దుబాయ్ లో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారంట. అలా ఇండియన్స్ దుబాయ్ లోని ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ లో ఇళ్లు కొనుగోలు చేస్తే లక్షల్లో లాభాలు వస్తాయి. మరి.. దుబాయ్ లోని ఇళ్ల కొనుగోలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ లో కంటే దుబాయిలో ఇళ్లు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఓ విధంగా ఈ మాట వాస్తవమే. హైదరాబాద్ నగరంలో రూ.3 కోట్లు పెట్టి గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఇళ్లు కొనుకోవచ్చు. అంతే డబ్బులతో దుబాయిలో పెడితే అద్భుతమైన నివాసాలు లభిస్తున్నాయి. ఇక మరో అవకాశం ఏమిటంటే.. దుబాయ్ అనేది విహారయాత్రలకు స్వర్గధామం. కాబట్టి ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేస్తే.. నివాసం ఉండటం కంటే.. అద్దెలకు ఇవ్వొచ్చు. అదే డబ్బులకు హైదరాబాద్ లో కొనుగోలు చేసిన ఫ్లాట్ ను అద్దెకు ఇస్తే.. నెలకు మహా అయితే ఒకటి నుంచి రెండు లక్షల మధ్యలో రావచ్చు. అదే దుబాయిలో అయితే మనం ఊహించిన దానికంటే అధికంగా అద్దెలు వస్తాయి.
దుబాయ్ ప్రభుత్వం కల్పిస్తున్న కొన్ని అవకాశాలు కూడాఎంతో మేలు చేస్తున్నాయి. దుబాయ్ లో కోటిన్నరపైన పెట్టుబడి పెట్టి ఇళ్లను కొనుగోలు చేసిన వారికి పదేళ్ల కాలపరిమితితో వీసా కూడా జారీ చేస్తున్నారు. అది కేవలం కొనుగోలు చేసిన వ్యక్తికే కాకుండా అతడి కుటుంబం మొత్తానికి వర్తించేలా ఉంటుంది. గోల్డెన్ వీసాతో చాలా వెసులుబాట్లు ఉన్నాయి. ఈ వీసా అనేది కేవలం టూరిస్ట్ వీసా కాదు. అక్కడ పదేళ్ల పాటు నివాసించవచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు, ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా చేయవచ్చు. డిసెంబర్ నుంచి జనవరి మధ్య దుబాయ్ లో విహార యాత్రికుల తాకిటి బాగా ఉంటుంది. ఆ సీజన్లలో ఇళ్లను రోజుకి రూ.30 వేల చొప్పున అద్దెకు ఇస్తున్నారు. ఇదే సమయంలో దుబాయ్ లో ఇండియా స్థాయిలో పన్ను పోటు ఉండదు. కాబట్టి భారీగా సంపాదించుకోవచ్చు.
మనం ఉండటానికి అయితే ఇండియాలో ఇళ్లు కొనుగోలు చేయడం మంచిదే కానీ అద్దెలకు ఇవ్వాలనుకునే వారికి మాత్రం దుబాయ్ లో ఇళ్లు సరైనవి. 2022లో దుబాయ్ లో రూ.35,500 కోట్లు ఖర్చు పెట్టి భారతీయులు ఇళ్లను కొనుగోలు చేశారు. ఇది 2021 సంవత్సరంలో ఖర్చు చేసిన డబ్బుతో పోలిస్తే రెట్టింపు. అయితే దుబాయ్ లో ఇళ్లు కొనుగోలు చేసిన భారతీయులందరూ అపర కుబేరులు, టాటా బిర్లాలు, అంబానీలు కాదు. చాలా మంది ఎగువ మధ్యతరగతికి చెందిన ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో దుబాయ్ లో పెట్టుబడులు పెడుతున్నారు.
అయితే వారిలో భారతీయులు ముందంజలో ఉన్నారన్నట్లు తెలుస్తోంది. ఈ ఇళ్ల కొనుగోలుపై కొందరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 సంవత్సరం మొత్తం కష్టపడితే అమ్మగలిగే ఇళ్లను ఈ ఏడాది కేవలం ఒక నెలలో అమ్మేస్తున్నమిని డిమాండ్ ఆ రేంజ్ లో ఉందని దమాక్ ప్రొపెర్టీస్ డైరెక్టర్ అష్రత్ తెలిపారు. దుబాయ్ లో ఇళ్లు కొనుగోలు చేసే వారిలో మొదటి స్థానంలో భారతీయులు ఉండగా తరువాతి స్థానంలో రష్యావాళ్లు ఉన్నారంట. దుబాయ్ లోని రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో 15-20 శాతం భారతీయులవే ఉన్నాయంట.
ఎగువ మధ్యతరగతి, ఆపై తరగతుల వారికి దుబాయ్ లో ఇళ్లపై పెట్టుబడులు అనేది లాభసాటి మార్గంగానే అనిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఓ ప్రమాదం లేకపోలేదు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అయినట్లు ఈ మార్కెట్ విలువ ఆవిరైపోయితే అప్పుడు వాటిని విక్రయించేందుకు ఇబ్బందులు పడాలేమో ఆలోచించాలి. అయితే అలాంటి పరిస్థితి రాదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయం వచ్చే నాటికి అందరి కి పెట్టుబడంతా వెనక్కి వచ్చి.. కేవలం ఆస్తులు మిగిలి ఉంటుందన్ని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. దుబాయ్ లో ఇళ్ల కొనుగోలు విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.