మనిషి జీవిత కాలంలో ఎన్నో మధురానుభుతులు ఉంటాయి. వాటిల్లో పెళ్లికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు పెళ్లి చేసుకోబోయే ముందు అటేడు తరాలు.. ఇటేడు తరాలు చూడాలి అని. కానీ ఇప్పుడు ఏడు కాదుకదా 14 తరాలు చూసినా కొన్ని పెళ్లిళ్లు మండపంలోనే ఆగిపోతున్నాయి. అలాంటి సంఘటనే ఒకటి ట్యునీషియా దేశంలో జరిగింది. మరి ఆ పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు.. మండపంలో ఉన్నారు. అక్కడ అంతా ఆనందమే.. అతిథులు వస్తూ.. పోతూ ఉన్నారు. పెళ్లి కూతురు ఆనందానికి అవధుల్లేవు. తనకు కాబోయే అత్తకు కూడా అమె నచ్చడంతోనే ఈ పెళ్లి పీటలు దాకా వచ్చింది. కానీ ఇంతలోనే ఓ పిడుగు లాంటి వార్త. ఈ పెళ్లి జరగట్లేదని. ఇలాంటి సీన్లు సాధారణంగా సినిమాల్లో జరుగుతాయి. కానీ ఇది నిజం. పెళ్లి మండపంలో అర్థాంతరంగా పెళ్లి ఆగిపోయి ఆ వధువుకు చేదు అనుభూతులను మిగిల్చింది.
ప్రముఖ వార్తా పత్రిక ‘ది మిర్రర్’ కథనం ప్రకారం.. ఈ సంఘటన ట్యునీషియాలో చోటుచేసుకుంది. మండపంలో వధువును చూసిన కొందరు ఆమె గురించి హీనంగా మాట్లాడారు. వరుడి తల్లి కూడా దానికి వంత పాడుతూ.. వధువును కురూపి అంటూ విమర్శించింది. అదీ కాక పెళ్లి రద్దు చేయాలనే నిర్ణయానికి సైతం వచ్చింది. కొడుకు కూడా తల్లి సలహా మేరకు వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. దాంతో ఇది చూసి పెళ్లి పందిరిలో ఉన్న అతిథులు అంతా కంగుతిన్నారు.
వివాహం ఆగిపోయిన నేపధ్యంలో లామియా అల్-లాబావి బ్లాగ్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని రాసింది. అందులో తాను అనాథను అయ్యానని పేర్కొంది. పెళ్లికి భారీగానే ఖర్చు చేశామని తెలుపుతూ.. పెళ్లి ఆగిపోవడంతో షాక్‌కు గురయ్యానని వాపోయింది. లామియా పోస్ట్‌ను చూసిన యూజర్స్ ఆమెకు మద్దతు పలుకుతూ వరుడ్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక యూజర్ ఆమెకు మద్దతు పలుకుతూ ‘మీ తల పైకెత్తండి మీ స్వశక్తితో ప్రపంచాన్ని ఎదుర్కోండి’ అని పేర్కొన్నాడు. మరొక యూజర్ ‘ఏదో ఒకరోజు మీకు మంచి భర్త లభిస్తాడని’ రాసుకొచ్చాడు. మరి ఆ యువతి వేధన పై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.