175 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకెళ్లిన పాపానికి మనం ఇప్పటికీ తిట్టుకుంటూ ఉంటాం. మా వజ్రాన్ని మాకు వెనక్కి ఇచ్చేయండి అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తాం. కానీ వాళ్ళు ఇవ్వరు, మనం అడగడం మానం. కోహినూర్ వజ్రానికి ఎందుకింత డిమాండ్ అంటే.. ఆ వజ్రం అమ్మిన డబ్బులతో ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రెండున్నర రోజుల పాటు భోజనం పెట్టచ్చునని అప్పట్లో ఒక రాజు అన్నాడట. అందుకే అంత డిమాండ్ ఆఫ్ వరల్డ్ అన్న మాట. ఈ వజ్రానికే కాదు, ఏ వజ్రానికైనా డిమాండ్ అనేది ఉంటుంది. ఆయా వజ్రాల ప్రత్యేకతలు బట్టి దాని ఖరీదు ఉంటుంది. అందుకే వాటిని వేలంలో పెడుతుంటారు. ఆ మధ్య పింక్ డైమండ్ ఒకటి వేలంలో పెడితే 480 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరొక డైమండ్ వేలానికి సిద్ధమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన ‘గోల్డెన్ కనరీ’ వజ్రాన్ని న్యూయార్క్ లోని సోతిబై వజ్రాల ప్రదర్శనలో ఉంచారు. దుబాయ్ కి చెందిన ఈ వజ్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 7న న్యూయార్క్ లో వేలం వేయనున్నారు. దీని ధర 15 మిలియన్ డాలర్లు, మన కరెన్సీలో 124 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేలంలో ఇంకా ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని మైనింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. 1980లో కాంగో దేశంలోని ఎంఐబీఏ అనే వజ్రాల మైనింగ్ సంస్థ.. వజ్రాల కోసం మట్టిని తవ్వి ప్రతీ రాయిని క్షుణ్ణంగా పరిశీలించి, ఏదైనా వజ్రాలు దొరికితే తీసుకునేది. ఆ తర్వాత మట్టిని, రాళ్లను దూరంగా పారబోసేది. అలా పారబోసిన దాన్ని చెత్తగా పరిగణిస్తారు. ఒకరోజు అలా పారబోస్తున్న చెత్తను ఓ ఇంటి యజమాని తనకి కావాలని అడిగాడట.
తన ఇంటి పెరట్లో ఏర్పడిన గుంతని పూడ్చేందుకు అడగడంతో కాంట్రాక్టర్.. ఆ వేస్టేజ్ ని ఆ యజమాని ఇంటి పెరట్లో వేశాడు. ఆ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారికి.. ఆ చెత్తలో ఒక రాయి మెరుస్తూ కనిపించింది. దాన్ని తీసుకెళ్లి యజమానికి ఇవ్వడంతో.. ఆ యజమాని దాన్ని వజ్రాల వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకున్నాడు. మొదట్లో దీని బరువు 890 క్యారెట్లు ఉండేది. ఆ తర్వాత అనేక చేతులు మారిన ఈ వజ్రాన్ని తలో చెయ్యి వేసి సానబెట్టడంతో చివరకు 303.10 క్యారెట్లకు తగ్గింది. అదే ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన, అరుదైన, పసుపు రంగు వజ్రం గోల్డెన్ కనరీగా దుబాయ్ కి కీర్తి, ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. అంతేకాదు దీన్ని దోషరహిత వజ్రంగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్ద వజ్రంగా పేరు తెచ్చుకున్న ఈ వజ్రం ధర వేలం పాటలో 124 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఏ కుబేరుడు ఈ వజ్రాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.