పక్షుల్లో కాకులకు ప్రత్యేక స్థానం ఉంది. మిగతా పక్షులతో పోలిస్తే వీటికి ఐకమత్యం ఎక్కువ. తమలో ఏదైనా ఒక్క కాకికి ఆపద వాటిల్లితే.. గుంపుగా వచ్చేస్తాయి. ఇక మన సమాజంలో కాకులు అనగానే అన్ని దుశ్శకునాలే గురించి చెప్పారు. మరణించిన వ్యక్తులకు పిండప్రదానం చేసే సమయంలో కాకుల కోసం ఎంతసేపైనా సరే నిరీక్షిస్తారు. ఇంత సడెన్ గా ఈ కాకుల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. ఓ చోట కాకులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటమే కాక మనుషులు చేస్తున్న తప్పును సరిదిద్దుతున్నాయి. ఎక్కడో తెలియాలంటే.. ఇది చదవండి
స్వీడన్‌లోని వీధుల్లో సిగరెట్ తాగి పీకలను విసిరేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలా రోడ్లపై ఉండే చెత్తలో సుమారు 62 శాతం ఈ సిగరేట్ పీకలదే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడి ప్రభుత్వానికి ఇదొక పెద్ద సమస్యగా మారిపోయింది. ఒక సోడర్టాల్యా మున్సిపాలిటీ పరిధిలో రహదారులను శుభ్రం చేసేందుకు ఏటా రూ. 16 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఎలాగైనా ఈ ఖర్చును తగ్గించాలని స్థానికంగా ఉన్న కోర్విడ్ క్లీనింగ్ అనే స్టార్టప్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
కోర్విడ్ క్లీనింగ్ కంపెనీ కాకులతో చెత్తను శుభ్రం చేయించే ఓ వినూత్న ఆలోచన చేసింది. ఇందుకోసం కోర్విడ్ అనే జాతికి చెందిన కాకులను రంగంలోకి దింపింది. ఈ కాకులకు రోడ్డుపై పడి ఉన్న సిగరెట్ పీకలను, చెత్తను డబ్బాలో వేసేలా శిక్షణ ఇచ్చారు. ఇలా కాకి డబ్బలో చెత్త పడేయగానే ఆహారం బయటకు వచ్చేలా సెట్ చేశారు. దీంతో కాకి ఆహారం కోసం ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంటుంది. దీంతో ఇటు రోడ్లు శుభ్రం అవ్వడమే కాకుండా..అటు కాకులకు ఆహారం కూడా లభిస్తుంది. ఈ వినూత్న ఆలోచన మున్సిపాలిటీ వారికి భారీగా కలిసొచ్చింది. ఒక్కో సిగరెట్ పీకను తీయడానికి అయ్యే ఖర్చుల్లో నాలుగో వంతు ఖర్చు చేస్తే చాలు కాకులు ఆ పని చేసి పెడుతున్నాయి. ప్రస్తుతం కాకులకు మాత్రమే శిక్షణ ఇచ్చామని రానున్న రోజుల్లో ఇతర పక్షులను కూడా రంగంలోకి దింపుతామని అధికారులు చెబుతున్నారు. చూశారుగా అన్ని తెలిసిన మనుషులు చెత్తను రోడ్లపై పడేస్తుంటే, ఏమి తెలియని కాకులు రోడ్లను ఎలా శుభ్రం చేస్తున్నాయో.