చిన్నపిల్లలు ఆటలు ఆడటం మామూలే. అయితే గేమ్‌లో మునిగిపోయి ఓ బాలుడు తప్పిపోయాడు. ఏకంగా దేశం దాటిపోయాడు. అసలేం జరిగిందంటే..!
చిన్నపిల్లలకు ఆటలంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఎప్పుడూ చదువులతో బిజీగా ఉండే చిన్నారులు.. ఏ కాస్త గ్యాప్ దొరికినా దొంగాపోలీస్, హైడ్ అండ్ సీక్ లాంటి గేమ్స్ ఆడుతుంటారు. ఇలాంటి ఆటల్లో మునిగిపోయి ఒక్కోసారి పిల్లలు తప్పిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఘటనే బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. ఆటలో నిమగ్నమైన ఓ బాలుడు ఎవరికీ దొరక్కూడదని ఒక కంటైనర్‌లో దాక్కున్నాడు. దాన్ని ఓడలోకి ఎక్కించడంతో దేశం దాటి.. పరాయిదేశానికి చేరాడు. అయితే ఉన్నతాధికారులు ఆ బాలుడ్ని గుర్తించి ప్రత్యేక చొరవతో ఎట్టకేలకు అతడ్ని స్వశానికి చేర్చారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఎండీ రతుల్ ఇస్లామ్ ఫహిమ్ అనే బాలుడు ఓ పోర్టు ప్రాంతంలో నివసిస్తున్నాడు.
జనవరి 11న తన తోటి పిల్లలతో కలసి ఆడుకుంటూ దగ్గర్లోని కంటైనర్‌లో దాక్కున్నాడు ఫహిమ్. దీంతో ఫ్రెండ్స్ ఎంత వెతికినా అతడు కనిపించలేదు. కంటైనర్‌లో సరుకు లేకపోవడంతో పోర్టు సిబ్బంది దీన్ని పూర్తిగా తనిఖీ చేయలేదు. అలాగే క్రేన్ సాయంతో ఆ కంటైనర్‌ను ఓడలోకి ఎక్కించారు. ఆ ఓడ అక్కడి నుంచి మలేసియాకు బయల్దేరింది. ఆ తర్వాత కంటైనర్‌లో నుంచి శబ్దాలు రావడంతో గుర్తించిన ఓ ఎంప్లాయి లోపల ఎవరో ఉన్నారని సహచరులకు చెప్పాడు. తలుపులు తీసి చూడగా బాలుడు ఫహిమ్ కనిపించాడు. లోపల వెలుతురు లేకపోవడంతో అతడి ఆరోగ్యం క్షీణించింది.
కంటైనర్‌లో బాలుడు చిక్కుకున్న విషయం తెలుసుకున్న మలేసియాలోని క్లాంగ్ డిస్ట్రిక్ ఆఫీసర్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులు, మెరైన్ పోలీసులు ఆ పోర్టు వద్దకు చేరుకున్నారు. బలహీనంగా ఉన్న పిల్లాడ్ని ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించారు. అతడ్ని మానవ అక్రమ రవాణా ముఠా తీసుకొచ్చిందేమోనని వాళ్లు అనుమానించారు. కానీ విచారణలో అందుకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. తమ ఎంక్వైరీలో అక్రమ రవాణా కాదని తేలిందని అసిస్టెంట్ కమిషనర్ చా హూంగ్ ఫోంగ్ చెప్పారు. దీంతో బంగ్లాదేశ్ హై కమిషనర్‌తో మాట్లాడి బాలుడ్ని స్వదేశానికి పంపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.