చరిత్రలో చాలా దొంగతనాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని దొంగతనాలు మాత్రమే జనాల్ని నోరెళ్లబెట్టేలా చేస్తాయి. సాధారణంగా ఇలాంటి చోరీలు మనం సినిమాల్లో చూస్తాం. ఇక మ్యూజియంలో చోరీ అంటే.. అందరికి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మ్యూజియంలో చేసిన దొంగతనమే కళ్ల ముందు కదులుతుంది. ఇలాంటి దొంగతనమే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ మ్యూజియంలో నుంచి సుమారు 13. 64 కోట్ల రూపాయల ప్రాచీన బంగారు నాణేలను కేవలం 9 నిమిషాల్లోనే చోరీ చేశారు. కట్టుదిట్టమైన టెక్నాలజీ ఉన్నప్పటికీ ఆ చోరులు చేసిన సాహసానికి అందరు ఆశ్చర్యపోతున్నారు. సమకాలీన చరిత్రలో ఇదే అత్యంత భారీ దొంగతనంగా చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..
అది అర్ధరాత్రి.. ఓ మ్యూజియం అందంగా మెరుస్తోంది. అంతకంటే అందంగా మెరుస్తున్నాయి అందులో ఉన్న కోట్ల విలువ చేసే బంగారు నాణేలు. బంగారం అంటే ఎవరి చేదు చెప్పండి. అందుకే కన్నేశారు ధూమ్ 2 లాంటి చోరుల బ్యాచ్. ఇంకేముంది.. పక్కాగా ప్లాన్ వేశారు చిన్న కునుకు తీసే లోపే పెద్ద బొక్కపెట్టారు. జర్మనీ దేశం బవేరియాలోని మాంచింగ్ నగరంలో ఓ ప్రముఖ మ్యూజియం ఉంది. అందులో సెల్టిక్ నాగరికత నాటి ప్రాచీన బంగారు నాణేలు ఉన్నాయి. వీటి విలువ సుమార్ 16 లక్షల యూరోలు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 13.64 కోట్ల రూపాయలు. దోపిడీ దొంగలు బుధవారం అర్దరాత్రి ఈ ప్రాచీన బంగారు నాణేలను దొంగలించారు. కేవలం 9 నిమిషాల్లోనే ఈ ఘరానా చోరులు పని పూర్తిచేసి దర్జాగా చెక్కేశారు.
ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే చోరీ జరిగే కొన్ని నిమిషాల ముందే.. దొంగలు మ్యూజియంలో ఉన్న అలారం వ్యవస్తను ధ్వంసం చేశారు. అందుకే వారు తలుపులు తీసినా గానీ ఎలాంటి అలారం మ్రోగలేదు. ఉదయాన్నే మ్యూజియంకు వచ్చిన ఉద్యోగులు జరిగిన తతంగాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నాణేలు పోవడంతో ఎంతో బాధపడుతున్నాడు స్టేట్ ఆర్కియలాజికల్ కలెక్షన్ విభాగాధిపతి రూపర్ట్ గెభార్డ్. ఈ నేపథ్యంలోనే 1999లో పురావస్తు తవ్వకాల్లో ఈ ప్రాచీన బంగారు నాణేలు బయటపడ్డాయని, ఆ కాలంలో కనుగొన్న అతిపెద్ద బంగారు నిధిగా దీన్ని పరిగణిస్తారని ఆర్కియాలజి నిపుణులు మార్కస్ బ్లూమ్ పేర్కొన్నారు. ఇక ఈ చోరీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పలు కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు.