హెడీ లామర్!.. ఒకప్పుడు వెండితెరను ఏలిన నటీమణి. రంగుల ప్రపంచంలో బిజీగా ఉన్న ఒక కళాకారిణి పరిశోధనల వైపు మొగ్గు చూపడం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తుంది. కానీ ఆమె ఆవిష్కరణలు చూస్తే మాత్రం తన సమయాన్నంతా పరిశోధనలకే వినియోగించి ఉంటే ఆమె మానవాళికి ఉపయోగపడే మరెన్ని ఆవిష్కరణలు సాధించేవారో కదా అనిపిస్తుంది. వియన్నాలో పుట్టిన ఈమె ఇవా మారియా అనే పేరుతో పెరిగి ‘ఎక్‌స్టసీ’ అనే చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయమైంది. ఆ తర్వాత లూయి మేయెర్ ప్రోద్బలంతో హెడీ లామర్‌గా పేరు మార్చుకుని క్లార్క్ గేబుల్, స్పెన్సర్ ట్రేసీ, జేమ్స్ స్టువార్ట్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. నటిస్తూనే పరిశోధనలూ చేసింది. లామర్ కనిపెట్టిన వాటిలో కరిగే టాబ్లెట్ ఒకటి. కోకా కోలా వంటి కూల్‌డ్రింక్స్ జన సామాన్యంలో ప్రాచుర్యం పొందడానికి ముందు ఈ కరిగే టాబ్లెట్ ప్రాచుర్యంలో ఉండేది. గ్లాసుడు నీళ్లలో ఈ టాబ్లెట్‌ను వేస్తే అది బుసబుస పొంగుతూ మంచి పానీయంలా మారేది. ట్రాఫిక్‌లో స్పాట్‌లైట్ పద్ధతిని కూడా ఆమే కనిపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో లామర్ టార్పెడోల గమనాన్ని నిర్దేశించే రేడియో గైడెన్స్ సిస్టమ్‌ను రూపొందించారు. ఆ తర్వాత దాన్ని మరింత మెరుగుపరిచి ‘ఫ్రీక్వెన్సీ హాపింగ్ స్ర్పెడ్ స్పెక్ట్రమ్’ టెక్నాలజీని రూపొందించారు. దీనికి 1942లో పేటెంట్ హక్కులు సంపాదించినా ఈ టెక్నాలజీని వినియోగించడానికి అమెరికా సైన్యం అంగీకరించలేదట. ఎందుకంటే ఏమి కనిపెట్టినా తామే కనిపెట్టాలి కదా! అందునా మహిళలు కనిపెట్టిన టెక్నాలజీని వాడడమా? అనే అహం వారిలో ఉండేది. కాని టెక్నాలజీని వాడకుండా ఎన్నాళ్లు ఉండగలరు?
చివరికి రెండు దశాబ్దాల తర్వాత అమెరికా సైన్యం టార్పెడోల వినియోగంలో ఈ టెక్నాలజీని వినియోగించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగిస్తున్న వైఫై, బ్లూటూత్, జీపీఎస్ టెక్నాలజీకి ఊపిరి పోసింది లామర్ కనిపెట్టిన టెక్నాలజీనే. 85 సంవత్సరాల వయస్సులో మరణించిన తరువాత, ఆమెను నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు.