న్యూ ఢిల్లీ- భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మోదీతో పాటు 75వ గణతంత్ర్య వేడుకల్లో పాల్గొనే ఇతర ప్రముఖులకూ ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. ఈమేరకు పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ ప్రాంతంలోని ఉగ్ర గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు నిఘావర్గాలు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులు, కీలక సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడం ఆ ఉగ్ర గ్రూపుల లక్ష్యమని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఉగ్రదాడులకు డ్రోన్ లను ఉపయోగించే అవకాశం కూడా ఉందని తెలిపారు. పాకిస్థాన్ లో ఉంటున్న ఖలిస్థానీ గ్రూపులు కూడా పంజాబ్‌లో తిరిగి తమ కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు, కేడర్‌ను సమీకరించడంతో పాటు రీగ్రూపింగ్ చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లోను విధ్వంసానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు నిధా వర్గాల నివేదిక చెబుతోంది. ప్రధాన మంత్రి పాల్గొనే సభలు, ఆయన పర్యటించే ప్రాంతాల్లో పేలుళ్లకు ఖలిస్థానీ గ్రూపులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు 2021 ఫిబ్రవరిలోనూ ఓ హెచ్చరిక వచ్చింది. ఢిల్లీలో ఫిబ్రవరి 15 వరకు నిషేధాజ్ఞలు నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిషేధాజ్ఞలు విధించారు.
ఢిల్లీలో డ్రోన్‌లు, పారా గ్లైడర్లు, పారా మోటార్లు, యూఏవీలు, తేలికపాటి సూక్ష్మ విమానాలు, రిమోట్ కంట్రోల్‌తో ఎగిరే వస్తువులు, ఎయిర్ బెలూన్‌లు, గాలిలో ఎగిరే చిన్నపాటి విద్యుత్ వాహనాలు, పారా జంపింగ్‌లపైనా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉగ్రవాదులు వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున ఈ ఆదేశాలు జారీ అయ్యాయని ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు.