హైదరాబాద్- ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అందులోను సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై వేధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో అమ్మాయిలు, మహిళలకు సంబందించిన అసభ్యకరమైన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలను మనం ఎన్నో చూస్తున్నాం.
తాజాగా హైదరాబాద్ లో అలాంటి వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చూపుల్లో తాను నచ్చలేదని చెప్పిందన్న ఆక్రోశంతో ఓ యువతిపై ఫేస్ బుక్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న దుర్మార్గుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ శివారు ప్రాంతం బోడుప్పల్ కు చెందిన ఓ యువతి నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది.
గత కొన్నాళ్లుగా తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నాకు. తన వివాహం కోసం మ్యాట్రిమోని సైట్ లో పేరు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ వధువు కోసం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన 29 ఏళ్ల సువనం సాయికుమార్ ఆమెను సంప్రదించాడు. అతని వివరాలు నచ్చడంతో పెళ్లి చూపుల కోసం యువతి కుటుంబం ఆహ్వానించింది. నెల రోజుల క్రితం పెళ్లి చూపుల కోసమని కుటుంబీకులతో కలిసి బోడుప్పల్ లోని యువతి ఇంటికొచ్చాడు.
కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సాయికుమార్ యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీంతో ఈ సంబంధం వద్దని సాయికుమార్ కు చెప్పేశారు. ఇంకేముంది ఆ యువతిపై సాయికుమార్ పగ పెంచుకున్నాడు. ఆమెను అబాసుపాలు చేయాలని భావించిన సాయికుమార్..ఫేస్ బుక్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ యువతికి అసభ్య మెసేజ్ లు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తీవ్ర ఆవేధనకు గురైన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన మెడిపల్లి పోలీసులు సాయికుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.