తమిళ స్టార్ హీరో తలా అజిత్ నటించిన తాజా మూవీ‘వలిమై’. ఈ చిత్రంలో అజిత్ కి విలన్ గా టాలీవుడ్ నటుడు కార్తికేయ నటిస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రంపై భారీగానే అంచానాలు ఉన్నాయి. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దొపిడీ, క్రైమ్, రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. బాలీవుడ్ బ్యూటీ హ్యమా ఖురేషీ.. అజిత్ సరసన నటిస్తోంది. ఈ సినిమా గురువారం(ఫిబ్రవరి 24న) థియేటర్లలో రిలీజైంది.
అజిత్ సినిమా ఫస్ట్ డే చూసేందుకు థియేటర్‌కు తరలివచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుండగా ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని గంగ వల్లి మల్టీప్లెక్స్‌లో అజిత్ వలిమై సినిమా రిలీజ్ అయ్యింది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో అనుకోకుండా ముగ్గురు దుండగులు థియేటర్‌లో పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. వారిని పట్టుకోవడానికి అజిత్ అభిమానులు ప్రయత్నించారు. కానీ దుండగులు తప్పించుకున్నారు.
ఈ దాడిలో ముగ్గురు అభిమానులకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దుండగులను వెంటనే పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన వలిమైకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అజిత్, కార్తికేయల నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.