స్పోర్ట్స్ డెస్క్- జపాన్ లో అట్టహాసంగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ అందించి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. వందేళ్ల కలను నీరజ్ చోప్రా సాకారం చేశాడు. జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ ఈటెను అత్యధికంగా 87.58 మీటర్ల దూరానికి విసిరి స్వర్ణాన్ని సాధించాడు. ఈ అద్భుత విజయంపై నీరజ్ చోప్రా స్పందించాడు.
ఇది నేను నమ్మలేకపోతున్నాను.. అంటూ నీరజ్ కామెంట్ చేశాడు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి.. ఇవి నాకు, దేశానికి గర్వించదగ్గ క్షణాలు.. అని నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు. స్వర్ణం వస్తుందని ముందే ఊహించారా.. అని అడగ్గా.. ఇంతటి విజయం లభిస్తుందని ఊహించలేదని చెప్పాడు.
క్వాలిఫికేషన్ రౌండ్‌లో మంచి ప్రదర్శన చేశా, ఫైనల్స్‌లోనూ బాగానే ఆడతానని అనుకున్నా, కానీ స్వర్ణం వస్తుందని ఊహించలేదన్న నీరజ్ చోప్రా.. చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. నా పతకాన్ని మిల్కా సింగ్, పీటీ ఉషతోపాటు.. ఒలింపిక్స్ పతకానికి కొద్ది దూరంలో నిలిచిపోయిన భారత క్రీడాకారులకు అంకితం ఇస్తున్నానని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. ఈ విజయం భారతీయులందరిది అని సగర్వంగా చెప్పుకొచ్చాడు నీరజ్.
THE THROW THAT WON #IND A #GOLD MEDAL 😍#Tokyo2020 | #StrongerTogether | #UnitedByEmotion @Neeraj_chopra1 pic.twitter.com/F6xr6yFe8J
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 7, 2021