సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క-సారక్క జాతర.ఈ వనదేవతల జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతుంటారు.
ప్రతి రెండేళ్లకోసారి మాఘ మాసంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఈ జాతరకు కులమతాలకు అతీతంగా భక్తజనం తరలివస్తారు. తెలంగాణవ్యాప్తంగా ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి తరలివస్తుంటారు. కాగా, ఈ మహాజాతర విశిష్టతను గుర్తించి 1996లో నాటి ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది.
సమ్మక్క సారక్క వనదేవతల చరిత్ర :
సమ్మక్క సారక్క వనదేవతల చరిత్ర విషయానికి వస్తే.. ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఏడువందల ఏళ్ల క్రితం అక్కడ జరిగిన కథే సమ్మక్క- సారక్క జాతరకు కారణం. పూర్వం కోయదొరలు వేటకోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు. అప్పటి వరకు కరువు కాటకాలతో కష్టాలు పడ్డ ఆ ప్రాంతం చిన్నారి రాకతో సస్యశ్యామలం అయ్యింది. పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు.
మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. సారక్క నిజంగా దేవతలాగానే కరుణించేది. ఆమె చేతితో పసరు మందు ఇస్తే, ఎలాంటి రోగమైనా నయం అయిపోయేది. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు, మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క-పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు.
కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు దండయాత్ర :
అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మేడారం ప్రాంతంలో మళ్లీ కరువు మొదలైంది. కరువు వల్ల పగిడిద్ద రాజు, కాకతీయ సామ్రాజ్యానికి కప్పం కట్టలేకపోయాడు. దాంతో వేలాది మంది కాకతీయ సైనికులు, మేడారం మీద యుద్ధానికి వచ్చారు.
కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమర శంఖం పూరించాడు. కాకతీయులపై గిరిజనులు సైతం యుద్దానికి సై అన్నారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు-కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది.
సంపెంగవాగు పేరు జంపన్న వాగుగా మారింది:
సమ్మక్క తన కుటుంబంతో కలిసి కాకతీయ సైనికులని ఎదుర్కొంది. సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవింద రాజులు (సమ్మక్క-పగిడిద్దరాజు అల్లుడు) వీరోచితంగా పోరాటం చేశారు. కానీ, కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణించారు.
తన వాళ్ల చావు గురించి విన్న జంపన, అక్కడే ఉన్న సంపంగివాగులోకి దూకి మరణించాడు. అప్పటి నుంచి ఆ వాగులోని నీరు ఎర్రగా మారిపోయాయని చెబుతారు. ఆ వాగుకి జంపనవాగు అని పిలుచుకుంటున్నారు. తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి అపరకాలి అవతారం ఎత్తింది.. కాకతీయ సైనికులపై విరుచుకుపడింది.
ఆమెను ఎదిరించలేక ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు. కొన్ని రోజుల తర్వాత చెట్టుకింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమభరిణ కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు.
కుంకుమ భరిణెలకు పూజలు :
అప్పటి వరకు కరువుతో విల విలలాడిన కాకతీయ సామ్రాజ్యం మళ్లీ సస్యశ్యామలం అయ్యింది. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. కుంకుమ భరిణెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సాంప్రదాయం ఏర్పడింది.
సమ్మక్క జాతరని నాలుగురోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో మొదటి రోజు సారలమ్మ రూపాన్ని, మేడారంలోని గద్దె మీద నిలబెడతారు. రెండో రోజు చిలకలగుట్టలో, భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను కూడా గద్దె మీదకు తీసుకువస్తారు. మూడోరోజు సమ్మక్క, సారక్కలు ఇద్దరూ గద్దె మీద ఉండి భక్తులకి దర్శనమిస్తారు. నాలుగో రోజు సమ్మక్కసారక్కలను గద్దె మీదకు దించడం జరుగుతుంది.. దీంతో మహా జాతర ముగుస్తుంది.
బంగారం ప్రత్యేకత :
వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పించుకోవడం ఆచారం. తమ భాదలు, కష్టాలు వనదేవతలకు చెప్పుకొని అవి తీరేలా తాము సుఖ సంతోషాలతో ఉండాలని తమ బరువుకు తగ్గట్టుగా బెల్లాన్ని సమర్పించి.. అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సమయంలో లక్షలకొద్దీ జనం మేడారానికి వస్తారు.
నమ్మకం ఎక్కడో వనదేవతలు అక్కడ..అమ్మ అని పిలిస్తే చాలు కష్టాలు తీర్చే కొంగు బంగారాలు.. ఆ విశ్వాసమే సమ్మక్క సారలమ్మ ప్రపంచ చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించింది మేడారం జాతర. తమను నమ్మిన జనం కోసం, నమ్ముకున్న విలువల కోసం, జాతి ఆత్మాభిమానం కోసం ప్రాణాలు త్యజించి, వీరమరణాన్ని పొందిన సమ్మక్క, సారలమ్మలు వనదేవతలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.