ఉత్తర్ ప్రదేశ్- కరోనా సెకండ్ వేవ్ దాదాపు సద్దుమణిగి పోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నాం. దేశంలో రోజువారి కేసులు ఘననీయంగా తగ్గిపోవడంతో ఇక పరవాలేదని రిలాక్స్ అవుతున్న సమయంలో మరో కొత్త కరోనా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ జనాలను భయపెడుతుంది. ఇది డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి.
ఇదిగో ఇటువంటి సమయంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయంతో ఓ డాక్టర్ అతి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య, బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ సుశీల్ కుమార్ కాన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య, 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు తెలిసినప్పటి నుంచి డాక్టర్ సుశీల్ కుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.
తన భార్య, పిల్లలు ఒమిక్రాన్ మహమ్మారి బారిన పడి ఇబ్బంది పడకుండా ఉండాలంటే, ముందుగానే చంపేస్తే మంచిదని విపరీతంగా ఆలోచించాడు డైక్టర్. అలా ఆలోచించాడో లేదు వెంటనే విచక్షణ కోల్పోయి.. భార్యా, పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన సోదరుడికి ఫోన్ చేసి తాను చేసిన దారుణం గురించి చెప్పాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఐతే ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లే లోపే డాక్టర్ పారిపోయాడు.
హత్యలు జరిగిన స్థలంలో పోలీసులుకు ఓ డైరీ, హత్యకు వాడిన సుత్తి లభించాయి. మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డైరీ చదివిన పోలీసులు షాక్ అయ్యారు. తాను నయం కానీ ఓ జబ్బుతో బాధపడుతున్నట్లు నిందితుడు డైరీలో రాసుకున్నాడు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరం.. అది అందరిని చంపేస్తుంది.. నా అజాగ్రత్త వల్ల నేను తప్పించుకోలేని ఓ ప్రమాదంలో చిక్కుకున్నాను.. నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు.. అందుకే వారిని ముందే సురక్షితమైన ప్రాంతానికి పంపాలి.. అని డైరీలో రాసుకున్నాడు.