ఆడుకున్నప్పుడంతా సరదాగా ఉంటుంది కానీ..అదే ఆటలో గెలవాలన్న పంతం మొదలైతే మాత్రం కచ్చితంగా ఓడిపోయే వాడికి కడుపు మంట ఉంటుంది. ఆటలో గెలుపు ఓటములు సహజం అని కొంత మంది ఓడిపోవడాన్ని స్పోర్టివ్‌గా, చాలా మంది నెగిటివ్‌గా తీసుకుంటారు
ఆడుకున్నప్పుడంతా సరదాగా ఉంటుంది కానీ..అదే ఆటలో గెలవాలన్న పంతం మొదలైతే మాత్రం కచ్చితంగా ఓడిపోయే వాడికి కడుపు మంట ఉంటుంది. ఆటలో గెలుపు ఓటములు సహజం అని కొంత మంది ఓడిపోవడాన్ని స్పోర్టివ్‌గా, చాలా మంది నెగిటివ్‌గా తీసుకుంటారు. ఓడిపోయిన వాడి పట్ల గెలిచిన వాడు గేలి చేయడం, ఓడిపోయామన్న అక్కసుతో గెలిచినవాడిపై దుర్భాషలాడటం చేస్తుంటారు. దీని వల్ల స్నేహితుల మధ్య కూడా గొడవలైన సందర్భాలున్నాయి. కాలక్షేపానికి ఆడుకుంటున్న ఆట.. ఫ్రెండ్స్ మధ్య పెను చిచ్చు రేగి, చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలిగొనేలా చేసింది. ఈ ఘటన విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విశాఖలో నలుగురు స్నేహితులు కలిసి మద్దిల పాలెం కళాభారతి రోడ్డులోని కూరగాలయ బజారు దగ్గర ఉన్న సులభ్ కాంప్లెక్స్ వద్ద అష్టా చెమ్మా ఆడుకుంటున్నారు. వీరంతా పెయింటింగ్ పనులు చేస్తూ అప్పుడప్పుడు కాలక్షేపం కోసం ఈ ఆట ఆడుకుంటూ ఉంటారు. అలాగే తాజాగా కూడా అష్టా చెమ్మా ఆడుతున్నారు. అక్కడున్న కేర్ టేకర్ రామకృష్ణ.. ఇక్కడ ఆడొద్దని వారించి వెళ్ళిపొమ్మని చెప్పాడు. వెళ్లినట్లే వెళ్లి మళ్లీ తిరిగి ఆట మొదలు పెట్టారు. తనపై తిరగబడటంతో రామకృష్ణ కూడా ఇక పట్టించుకోలేదు.
ఆ సమయంలో నలుగురు తాగి ఉన్నారు. ఆట ఆడుకుంటుండగా.. వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో నారాయణరావును మరో స్నేహితుడు రాంబాబు గట్టిగా తోసేశాడు. దీంతో నారాయణరావు వెనక్కు పడిపోయాడు. తల రోడ్డుకు బలంగా తగలడంతో నారాయణరావు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.