స్పోర్ట్స్ డెస్క్- టీమ్ఇండియాలో కరోనా కలకలం రేపతోంది. విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కు ముందు జట్టులోని స్టార్ క్రికెటర్లకు కరోనా సోకడం ఆందళన కలిగిస్తోంది. టీమ్ ఇండియాలోని ఆటగాళ్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లు కరోనా బారిన పడ్డారు.
వీరితో పాటు మరో 5 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఐతే ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లకు కరోనా సోకడం మ్యాచ్ పై ఎంత మేర ప్రభావం పడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విండీస్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా గత శనివారమే అహ్మదాబాద్ కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఈనెల 6న తొలి వన్డే జరగాల్సి ఉంది. ఇటువంటి సమయంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. సాధ్యమైనంత వరకు విండీస్ తో మ్యాచ్ రద్దవకుండా బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ జరుగుతుందని సమాచారం.