హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ లోని ప్రభుత్వ గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు అందుతున్న చికిత్సను ఆయన పరిశీలిస్తారు. రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాల గురించి వారిని అడిగి తెలుసుకోనున్నారు. ఆ తరువాత గాంధీ వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సీజన్ సరఫరా, మందులు, వైద్య సిబ్బంది తదితర అంశాలపై చర్చిస్తారు. నిరుపేదల పాలిట ఆరోగ్య దేవాలయం అయిన గాంధీ ఆస్పత్రిని మరింత ఆధునీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ రోజు ఆస్పత్రిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత దానిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ దగ్గరే ఉండటంతో ఆయన గాంధీపై దృష్టి సారించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొది సారి గాంధీ ఆస్పత్రికి వస్తుండటంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గాందీ ఆస్పత్రి పరిసరాలతో పాటు, హాస్పిటల్ లోపల పూర్తి స్థాయిలో సానిటైజ్ చేశారు. ఐతే గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మామూలుగా మాస్క్ మాత్రమే ధరించి వెళ్తారా.. లేక పీపీఈ కిట్ ధరిస్తారా అన్నది ఆస్పత్రి వర్గాల్లా ఆసక్తి రేపుతోంది. ఇటీవలే కరోనా నుంచి సీఎం కేసీఆర్ కోలుకున్న సంగతి తెలిసిందే.
