ఫిల్మ్ అండ్ క్రైం డెస్క్- సినిమా నటులంటే అందరికి భలే క్రేజ్. అందులోను బాలీవుడ్ నటీనటులంటే ఇక చెప్పక్కర్లేదు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోను బాలీవుడ్ హీరో, హీరోయిన్లను అభిమానులు ఉన్నారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబందించిన న్యూస్ ఏదైనా అందరూ ఆసక్తిగా చూస్తారు. ఈ మధ్యకాలంలో సినీ నటులు చాలా మంది వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. డ్రగ్స్ నుంచి మొదలు క్యాస్టింగ్ కౌచ్ వరకు సినిమా పరిశ్రమకు చెందివారిపై పెద్ద ఎత్తున పోలీసులు కేసులు నమోదు అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఇచ్చిన కంప్లైంట్ తో చండీగఢ్ పోలీసులు సల్మాన్ ఖాన్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. హీరో సల్మాన్ ఖాన్, ఆయన చెల్లెలు అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు మరో ఏడుగురు వ్యక్తులపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేశాడు. సల్మాన్ ఖాన్ కు చెందిన బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని తనను అడిగారని ఆ వ్యాపారి చెప్పారు.
అందుకోసం పెట్టుబడి 2 కోట్లకు పైగా అవుతుందని తెలపడంతో, అంత మొత్తాన్ని తాను ఖర్చు పెట్టానని, చివరకు వాళ్ళు మోసం చేశారంటూ అరుణ్ గుప్తా పోలీసులకు పిర్యాదు చేశాడు. తాను బీయింగ్ హ్యూమన్ జువెల్లరీ పేరుతో షోరూమ్ తెరచి యేడాది దాటిపోయినా సదరు సంస్థ నుంచి తనకు రావాల్సిన మెటీరియల్ ఏదీ రాలేదని వ్యాపారి ఆరోపించాడు. ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్‌తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారని ఆయన చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా తన ఫ్రాంచసీ ప్రారంభించేందుకు స్వయంగా సల్మాన్ ఖాన్ కూడా వస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని అరుణ్ గుప్తా ఆరోపించాడు. అందుకని సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరాపై పోలీసులకు పిర్యాదు చేశానని చెప్పాడు. మరి పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారన్నదే ఇప్పుడు బాలీవుడ్ లో ఆసక్తిరేపుతోంది.