స్పోర్ట్స్ డెస్క్- టోక్యో ఒలింపిక్ విజేతలకు ప్రముఖ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రాకు 2 కోట్ల రూపాయలు ప్రకటించగా, మిగతా పతకాలు సాధించిన ఆరుగురికి కోటి రూపాయల చొప్పున బైజూస్ నగదు బహుమతి ప్రకటించింది. జాతి నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని బైజూస్ ఫౌండర్, సీఈవో బైజు రవీంద్రన్ వ్యాఖ్యానించారు.
టోక్యో ఒలింపిక్స్ విజేతలకు పలు ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా ఆఫర్లు ప్రకచించాయి. బెంగళూరుకు చెందిన స్టార్ ఎయిర్ టోక్యో ఒలింపిక్ విజేతలకు జీవితకాలం ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. మన దేశ ఒలింపిక్ విజేతలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని, కృషి, అంకితభావం ఉంటే పర్వాతాలను కూడా కదిలించవచ్చని వారు గుర్తు చేశారని స్టార్ ఎయిర్ సీఈవో సిమ్రన్ సింగ్ తివానా వ్యాఖ్యానించారు.
టోక్యో ఒలింపిక్ విజేతలకు జీవితాంతం తమ విమానంలో సేవలు అందించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తామని ఆయన అన్నారు. మరోవైపు ఇండిగో ఎయిర్‌లైన్స్ దేశానికి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు ఏడాది పాటు అపరిమితంగా ఉచిత టికెట్లను అందించనున్నట్టు ప్రకటించింది. ఇక టోక్యో ఒలింపిక్స్ విజేతలకు బీసీసీఐ కూడా ఇప్పటికే నగదు నజరానాను ప్రకటించగా, గోల్ట్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు హర్యాణా ప్రభుత్వం 6కోట్ల రూపాయల నగదు బహుమతిని ఇవ్వాలని నిర్ణయించింది.