బాక్సులు బద్ధలయ్యేలాంటి బ్లాక్ బస్టర్ లు కావాలంటే ఏం చేయాలి? అబ్బో… చాలా చేయాలి! కానీ, ఇప్పుడు కొందరు హీరోలు మాత్రం… బాక్సింగ్ చేస్తే బాక్సులు బద్ధలవుతాయని డిసైడ్ అయ్యారు! ఇంతకీ, ఎవరా బాక్సర్ బాబులు? ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మెగా హీరో వరుణ్ తేజ్ గురుంచి. ఇప్పటికే బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలిప్రేమ’ టైటల్ వాడేసుకున్నాడు వరుణ్ తేజ్. అలాగే.. ఈ మెగా ప్రిన్స్ ఇప్పుడు పవన్ లాగే బాక్సింగ్ మూవీ కూడా చేస్తున్నాడు. ‘తమ్ముడు’లో పవర్ స్టార్ బాక్సింగ్ పంచులు కురిపిస్తే.. వరుణ్ తేజ్ ‘గని’ సినిమాకోసం బాక్సింగ్ రింగులోకి దూకుతున్నాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో రూపొందుతున్న’గని’ ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీకోసం ప్రత్యేకంగా అమెరికాలో బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు మెగా ప్రిన్స్. ఇలా బాక్సర్ గా బాక్సాఫీస్ ని షేక్ చేయాలనీ చూస్తున్నాడు వరుణ్ తేజ్.
కెరీర్ లో ఇంత వరకూ ముద్దులతోనే ఫేమస్ అయ్యాడు విజయ్ దేవరకొండ. కానీ, ఈ సారి గుద్దులతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు రొమాంటిక్ ‘రౌడీ’. నెక్ట్స్ ‘లైగర్’గా రాబోతున్నాడు ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో. తొలిసారి పాన్ ఇండియా రిలీజ్ కు కూడా రెడీ అవుతోన్న విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ మూవీలో బాక్సర్ గా సందడి చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ – ఛార్మీతో పాటు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ పలు భాషలలో ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక.. ‘లైగర్’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోందని.. ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్, అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ కు 200 కోట్లు ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే.. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. తన సినిమా థియేటర్లలో విడుదలైతే.. 200 కోట్లు కంటే ఎక్కువే వసూలు చేస్తుందని విజయ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం విజయ్ ట్వీట్ వైరల్ గా మారింది.
తెలుగు వారికి కూడా బాగానే పరిచయమున్న తమిళ హీరో ఆర్య. ఈ టాలెంటెడ్ హ్యాండ్సమ్ మ్యాన్ మరోసారి వెరైటీని కోరుకున్నాడు. అంతే కాదు, అదే పనిగా జిమ్ములో దూరి కండలు పెంచాడు. అయితే, ఇదేదో సిక్స్ ప్యాక్ వ్యవహారం కాదు. సీరియస్ గా బాక్సింగ్ ప్రాక్టిస్ చేసి పెద్ద తెరపై పంచులు విసరబోతున్నాడు. ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ డైరెక్షన్ లో ఆర్య బాక్సర్ గా నటించిన పీరియాడికల్ డ్రామా ‘సార్పట్టా పరంబరై’. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఆద్యంతం బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో ఆర్య తో పాటు.. పలువురు నటులు బాక్సర్స్ గా అదరగొట్టబోతున్నారు.
‘తడమ్’తో తమిళనాట భారీ విజయాన్నందుకున్న అరుణ్ విజయ్ కూడా బాక్సింగ్ బాట పట్టాడు. ఆన్ స్క్రీన్ పై బాక్సర్ గా కనిపించేందుకు ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న అరుణ్ విజయ్ ‘బాక్సర్’ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రియల్ బాక్సర్ రితికా సింగ్ కథానాయికగా నటిస్తుండగా.. వివేక్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ‘భాగ్ మిల్కా భాగ్’ కోసం పరుగుల వీరుడు మిల్కాసింగ్ గా మురిపించిన ఫర్హాన్ అక్తర్.. ఈసారి ‘తుఫాన్’ కోసం బాక్సర్ గా మారాడు. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత ఓం ప్రకాశ్ మెహ్రా – ఫర్హాన్ అక్తర్ కాంబోలో వస్తోన్న చిత్రమిది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా.. పరేష్ రావెల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. జూలై 16 నుంచి ‘తుఫాన్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కావడానికి సిద్ధంగా ఉంది. మొత్తంమీద.. టాలీవుడ్ టు బాలీవుడ్ వరకూ రాబోతున్న ఈ బాక్సింగ్ మూవీస్ లో ఏఏ చిత్రాలు ఏరీతిన అలరిస్తాయో చూడాలి.