అమరావతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య జరుగుతున్న పీఆర్సీ సమస్య సమసిపోయింది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు, జగన్ సర్కార్ కు పోరు నడుస్తోంది. చివరికి ఉద్యోగులు సమ్మె చేసేందుకు సైతం సిద్దమయ్యారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
సుమారు 7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. గత కొన్ని రోజులుగా ఉద్యోగులు కోరుతున్న హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, పీఆర్సీ కాల పరిమితి, ఐఆర్ అడ్జస్ట్‌మెంట్, పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లపై ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించింది.
శుక్రవారం రాత్రి ఉద్యోగుల మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాము కోరుతున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఈ ధఫా జరిగిన చర్చలు సఫలమయ్యేలా ఉన్నాయని ఉద్యోగ సంఘ నేతలు చెప్పారు. మరోవైపు ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.
హెచ్ ఆర్ ఏ విషయంలో వివిధ స్లాబ్స్ ఉద్యోగులతో చర్చించి పెంచినట్లు మంత్రుల కమిటీ తెలిపింది. జిల్లా కేంద్రాల్లో 16 శాతం నిర్ణయించగా,హెచ్ఓడీ, సెక్రటేరియట్ వారికి జూన్ 2024 వరకు 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది. మారిన హెచ్ ఆర్ ఏ జనవరి 2022 నుంచి అమల్లోకి వస్తుంది. ఐతే ఫిట్ మెంట్ మాత్రం 23 శాతం అదే కొనసాగుతుంది. ఐఆర్ రికవరీ ఉపసంహరించుకున్నారు. పదేళ్లకో సారి కాకుండా ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.