విశ్వక్‌సేన్, మితిలా పార్కర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ ఓరి దేవుడా’. ఈ సినిమా తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఓ మై కడవులే’కు రీమేక్‌గా తెరకెక్కింది. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓరి దేవుడా సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ప్రస్తుతం మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతోంది. ఇక, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర చేశారు. తమిళంలో విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను తెలుగులో వెంకటేష్ చేశారు. కథను మలుపు తిప్పే దేవుడి పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో దాదాపు ఓ 15 నిమిషాలు మాత్రమే వెంకటేష్ కనిపిస్తారు. ఈ 15 నిమిషాల పాత్ర కోసం వెంకటేష్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓరి దేవుడా సినిమాలో తన పాత్ర కోసం వెంకటేష్ 5 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారంట.
ఈ ఐదు రోజుల కోసం ఏకంగా మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారంట. కాగా, ఈ సినిమాలో ఆశ భట్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. మాతృకను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తునే ‘ఓరి దేవుడా’ను తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఇక, దేవుడి క్యారెక్టర్‌ను తెలుగులో విక్టరీ వెంకటేష్ నభూతో నభవిష్యతిగా చేశారు. ఫన్ మిళితమైన క్యారెక్టర్ కాబట్టి అదరగొట్టేశారు. ఈ సినిమాలో వెంకటేష్‌ది ఎక్స్‌టెన్‌డెడ్ కేమియో. సినిమా ప్రారంభంలో కొన్ని నిమిషాలు మాత్రమే ఆయన ఉంటారు. ఉన్న కొన్ని నిమిషాలు ప్రేక్షకులతో ఆపకుండా విజిల్స్ వేయించారు.