సినీ పరిశ్రమ మళ్లీ కన్నీరుపెట్టింది. రెండు రోజుల క్రితం మాస్టర్ శివశంకర్ మరణగాయం మాయకముందే మరో సినీ ప్రముఖుడు కన్నుమూశారు. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) మృతిచెందారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంతో ఆయన ఇంటి పేరు మారింది.
సిరివెన్నెల సుమారు 3 వేలకు పైగా పాటలు రాశారు. అదేవిధంగా 165కుపైగా చిత్రాలకు పూర్తిస్థాయిలో పాటలు రాశారు. మూడున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రచయితగా రాణించారు. ఆయన తన రచనలతో 2019లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. తన సినీజీవితంలో 11 నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కెరీర్ లో మర్చిపోలేని పాటలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని అపురూపమైన పాటలు మీకోసం..
– సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటి చిత్రం‘సిరివెన్నెల’ మూవీలో అన్ని పాటలు అద్భుతమే.. అందులో‘విధాత తలపున’ పాటతో మొదలైన సీతారామశాస్త్రి పాటల పూదోటలో ఎన్నో అందమైన గులాబీలు విరిశాయి.
– మెగాస్టార్ చిరంజీవి, శోభన నటించిన ‘రుద్రవీణ’ చిత్రంలో ‘నమ్మకు నమ్మకు ఈ రేయినీ’, ‘లలిత ప్రియ కమలం విరిసినదీ’ అద్భుతమైన హిట్స్ గా నిలిచాయి.
– వెంకటేష్ హీరోగా నటించిన ‘స్వర్ణకమలం’చిత్రంలో ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ అన్న పాట ఇప్పటికీ మర్చిపోలేం
– ‘శ్రుతి లయలు’లో ‘తెలవారదేమో స్వామీ’మనోహరమైన పాటగా అలరించింది
– వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించిన ‘క్షణక్షణం’ చిత్రంలో ‘జామురాతిరి జాబిలమ్మా’ సూపర్ హిట్ గా నిలిచింది.
– జగపతి బాబు నటించిన ‘గాయం’చిత్రంలో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ ఉత్తేజపరిచే విధంగా ఉంటుంది.
– రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘మనీ’చిత్రంలో ‘చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ’ జీవితం గురించి సత్యాలు చూపించింది.
– జగపతి బాబు నటించిన ‘శుభలగ్నం’చిత్రంలో ‘చిలకా ఏ తోడు లేక’సెంటిమెంట్ పాటగా మంచి హిట్ అయ్యింది
– నాగార్జున, టబు నటించిన ‘నిన్నే పెళ్లాడతా’లో కన్నుల్లో నీ రూపమే మంచి రొమాంటిక్ సాంగ్ గా పేరు సంపాదించింది
– బ్రహ్మాజీ హీరోగా నటించిన ‘సింధూరం’లో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే’ విప్లవ గీతంగా ఎమోషన్ తో ఆకట్టుకుంది
– ‘నువ్వే కావాలి’లో ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే’ ఇప్పటికీ ఈ పాటకు ఎంతో క్రేజ్ ఉంది.
– ‘బొమ్మరిల్లు’లో ‘నమ్మక తప్పని నిజమైనా’హిట్ అందుకుంది.
– ‘గమ్యం’లో ‘ఎంత వరకూ ఎందుకొరకు’ మంచి హిట్ అయ్యింది.
– వరుణ్ సందేష్ నటించిన ‘కొత్త బంగారు లోకం’లో ‘నీ ప్రశ్నలు నీవే’ ఎంతో స్ఫూర్తిని కలిగించే విధంగా ఉంటుంది.
– ప్రభాస్ హీరోగా నటించిన ‘చక్రం’చిత్రంలో ‘జగమంత కుటుంబం’ ఈ పాట వింటుంటే కన్నీరు ఆగదు.
– రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో దశవతారం మంచి హిట్ సాంగ్ అయ్యింది.
– అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠ పురములో’ చిత్రంలోని ‘సామజవరగమన’ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది.
ఇలా చెప్పుకొంటే పోతే తెలుగు చిత్రాలకు తన రచనలతో వన్నె తెచ్చిన సీతారామశాస్త్రి పాటల భాండాగారంలో అమూల్యమైన ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. నేడు ఆయన మనల్ని వీడి పోయాడన్న వార్తవి యావత్ తెలుగు ప్రజానికం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.