గతేడాది లెజెండరీ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం సంగీత ప్రియులందరినీ కలచివేసింది. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులే కాదు.. ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు సైతం సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా సిరివెన్నెల జయంతి సందర్భంగా.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సిరివెన్నెల గారి వ్యక్తిత్వం గురించి, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి, ఆయన సాహిత్యం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
గతంలో ఓసారి సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో తెలిసిందే. ‘ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు..’ అనే త్రివిక్రమ్ మాటలకు సిరివెన్నెల గారు ఎంతో సంతోషించారు. తాజాగా తానా ప్రపంచ సాహిత్య వేదిక మరియు సిరివెన్నెల కుటుంబం సంయుక్తంగా శిల్ప కళావేదికలో సిరివెన్నెల జయంతి సందర్భంగా “ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య సంపుటి–1” పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ సిరివెన్నెల గురించి మాట్లాడుతూ.. “సీతారామశాస్త్రి గారితో నేను ఎన్నో వెన్నెల రాత్రులు గడిపాను. కానీ వెన్నెల లేని ఆయన గదిలో ధూమమేఘాల మధ్యలో ఆయన్నే చంద్రుడిలో చూసా చాలాసార్లు. చాలా సంవత్సరాలపాటు ఎన్నో మరపురాని క్షణాలు, గొప్ప గొప్ప పాటలు.. అర్థరాత్రి 12, 1 గంటకు కూడా శీను ఒక మంచి లైన్ వచ్చింది విను అని ఫోన్ చేసి చెప్పేవారు. ఒక కవి పాట పాడుతున్నప్పుడు విని ఆనందించడం గొప్ప అదృష్టం” అంటూ ఎమోషనల్ అయిపోయారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి త్రివిక్రమ్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.