ఇటీవల కాలంలో మన హీరో, హీరోయిన్ల చిన్న నాటి ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలను చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. అటువంటిదే ఈ ఫోటో. ఈ ఫోటోలో మీరు చూస్తున్న నటుడు.. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇంతకూ ఆ నటుడు ఎవరంటే..?
టాలీవుడ్ నటుల్లో కొంత మంది హీరోలు చాలా లేట్‌గా క్రేజ్ తెచ్చుకుంటారు. చిన్న చిన్న సినిమాలతో మెప్పిస్తూ.. స్టార్ డమ్‌కు దూరంగా బతుకుతూ, మంచి మంచి సినిమాలతో అలరిస్తూ ఉంటారు. సినిమా ఎంపికలోనూ భిన్నమైన కథలు ఉండేలా చూసుకుంటారు. అరే వీడి సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటుంది రా, లేదా తప్పకుండా వీడి సినిమా చూడాలిరా అనిపించేలా చేసుకుంటారు. ఓ ధోరణి మూసలో వీరి సినిమాలు ఉండవు. చేసిన కొన్ని సినిమాలు అయినా అందరి మదిలో గుర్తుండిపోయేలా చేస్తారు. అటువంటి అరుదైన ఆణిముత్యాల్లో ముందు వరుసలో ఉంటారు ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు.
అమాయకమైన చూపులతో చక్రల్లాంటి కళ్లతో తదేకంగా చూస్తున్న ఈ చిన్నోడికి గుర్తు పట్టారా.. లేదనుకుంటే.. మరోసారి చూడండి..ఇంతకు ఎవరో తెలుసా..? మన శర్వానంద్. ఎంత బబ్లీగా ఉన్నాడో కదా. అది ఆయన చిన్నప్పటి ఫోటో. శర్వానంద్ 1984, మార్చి 6వ తేదీన విజయవాడలో తన తాతగారింట్లో జన్మించాడు. ఈ రోజే ఆయన తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్న నాటి ఫోటో వైరల్‌గా మారింది. శర్వానంద్‌కు ఆనంద్ అనే ముద్దు పేరు కూడా ఉంది. శర్వా పుట్టింది బెజవాడలో అయినప్పటికీ.. పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే పూర్తయింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రామ్ చరణ్, రానాలు ఆయనకు క్లాస్ మేట్స్ అన్న విషయం తెలిసిందే.
విద్యాభ్యాసం పూర్తయ్యాక..సినిమాలపై ఉన్న ఫ్యాషన్‌తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన శర్వా.. ఐదో తారీఖు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో పాటు.. సినిమా ఆఫర్లు రాకపోవడంతో చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ.. సినిమా పరిశ్రమలో నిలదొక్కకునేందుకు ప్రయత్నించారు. గౌరీ, శంకర్ దాదా ఎంబిబిఎస్, లక్ష్మి, సంక్రాంతి, వెన్నెలలో పలు పాత్రల్లో నటించారు. ఈ మధ్యలోనే యువసేనలో ఓ హీరోగా కనిపించారు. చిన్న పాత్రలతో సరిపెట్టుకుంటున్న శర్వా రూట్‌ను మార్చిన సినిమా అంటే గమ్యం అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగానే కొనసాగుతూ వచ్చారు. కానీ మంచి కథలను ఎంపిక చేసుకుంటూ వచ్చారు.
అందరి బంధువయ్యా, ప్రస్తానం, జర్నీ వంటి సినిమాలు ఆయన ఖాతాలో హిట్ సినిమాలుగా నిలిచాయి. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. తమిళం, తెలుగులో సినిమాలు చేస్తూ వచ్చారు. కొన్ని డిజాస్టర్ గా నిలిచినా మళ్లీ నిలదొక్కుకున్నారు. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజులో సరికొత్త నటనతో ఆకట్టుకున్నారు. ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలు చేశారు. రణరంగం నుండి కొన్ని సినిమాలు చతికిల పడగా.. గత ఏడాది వచ్చిన ఒకే ఒక జీవితంలో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ప్రస్తుతం ఆయన 35వ సినిమాను ప్రకటించారు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తదుపరి సినిమా చేయబోతున్నారు. త్వరలోనే శర్వా పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నాడు. ఇటీవల ఆయనకు రక్షితా రెడ్డి అనే యువతితో నిశ్చితార్థం అయిన సంగతి విదితమే.