మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఎన్నో మరువలేని సినిమాలు ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి త్వరలో రీరిలీజ్ కానుంది. ఆ మూవీ ఏంటంటే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఎన్నో హిట్లు ఉన్నాయి. వాటిల్లో ‘ఆరెంజ్’ మూవీ సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. హిట్ అయిన సినిమాలనే కాదు.. డిజాస్టర్ అయిన మూవీస్‌కు కూడా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం ఉంటుందని చెప్పేందుకు ‘ఆరెంజ్’ చిత్రాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీ పూర్తిగా ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్‌స్టోరీగా రూపొందింది. ఇందులో చరణ్ లవర్ బాయ్‌గా నటించారు. ప్రేమకు స్పాన్ తక్కువని, కాబట్టి కొంతకాలమే ప్రేమిస్తా అంటూ చెర్రీ చెబుతూ ఉంటారీ మూవీలో. అంతకుముందు ఎవరూ టచ్ చేయని ఓ కోణంలో ఈ సినిమాను భాస్కర్ చెప్పే ప్రయత్నం చేశారు.
రెగ్యులర్ ఆడియెన్స్‌కు అంతగా కనెక్ట్ కాకపోవడంతో ‘ఆరెంజ్’ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. ‘ఆరెంజ్’ డిజాస్టర్ అవ్వడంతో చిత్రాన్ని నిర్మించిన నాగబాబు అప్పుల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో తాను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడ్డానని పలు సందర్భాల్లో స్వయంగా నాగబాబే చెప్పడం గమనార్హం. అయితే బిగ్‌స్క్రీన్ ఆడియెన్స్‌కు అంతగా కనెక్ట్ కాకపోయినా.. బుల్లితెర, యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు చేరువైంది ‘ఆరెంజ్’. ఇప్పటికీ చాలా మంది యూత్ ఈ మూవీని చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు రావాల్సిన ఈ మూవీ.. ఎప్పుడో 15 ఏళ్ల కింద వచ్చిందని, అదే సినిమాకు మైనస్ అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉంటాయి.
అలాంటి ‘ఆరెంజ్’ సినిమా మళ్లీ రిలీజ్ కానుంది. మార్చి 27వ తేదీన చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. చెర్రీ బర్త్ డేకు ‘మగధీర’ను విడుదల చేద్దామనున్నా ఎందుకనో వాయిదా వేశారు. ఇక, ‘ఆరెంజ్’ రీరిలీజ్ ద్వారా వచ్చే వసూళ్ల మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నాగబాబు నిర్ణయించుకున్నారని సమాచారం. యూత్ ఫేవరెట్ మూవీగా చెప్పే ‘ఆరెంజ్’ ఈతరం ఆడియెన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా, ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ముగియడంతో రామ్ చరణ్ స్వదేశానికి చేరుకున్నారు. ఆయన నేరుగా హైదరాబాద్‌కు కాకుండా ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. ఉదయం ‘ఇండియా టుడే కాన్క్లేవ్’లో గెస్ట్‌గా చెర్రీ పాల్గొననున్నారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారాయన. ఆ తర్వాతే భాగ్యనగరానికి రానున్నారు. ‘ఆరెంజ్’ రీరిలీజ్ కోసం మీరు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Orange special Shows on occasion of @AlwaysRamCharan birthday
27th March 🎉
Theatres gonna Turn into Musical Concerts❤️#RamCharan pic.twitter.com/7Eeoodeh38
— Thyview (@Thyview) March 17, 2023