టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నాడు దిల్ రాజు. ఆయన సొంతంగా స్థాపించిన శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌ను ఒక బ్రాండ్‌గా మార్చేశారు. సొంత సంస్థలో సినిమాలు తీస్తూ.. బయట సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తో.. విభిన్న రంగాల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాడు దిల్ రాజు. ఇండస్ట్రీలో ఆయనకు విజయాలు ఎన్ని ఉన్నాయో.. ఆయన పేరు మీద విమర్శలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. సినిమాల విడుదల విషయంలో ఆయన తీరు అనేక సార్లు వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఆయన సొంత నిర్మాణ సంస్థలో.. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న వారసుడు చిత్రం.. విడుదల విషయంలో వివాదం తెర మీదకు వచ్చింది. తాజాగా ఈ అంశంపై దిల్ రాజు స్పందించాడు.
టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. చిన్న, డబ్బింగ్ సినిమాలు వాయిదా పడతాయి. ఇదే విషయాన్ని గతంలో దిల్ రాజు కూడా ఖండించాడు. సంక్రాంతికి కేవలం స్ట్రెయిట్ తెలుగు సినిమాలు మాత్రమే విడుదల కావాలని అన్నారు. అలాంటిది.. ఈ సారి సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు దిల్ రాజు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ.. వీర సింహారెడ్డి సినిమాలు విడుదల కానున్నాయి.
వీటికి పోటీగా.. దిల్ రాజు తమిళ్ హీరో నటించిన వారసుడు చిత్రాన్ని విడుదల చేయడం కోసం భారీగా థియేటర్లు బుక్ చేసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. ‘‘సంక్రాతికి వారసుడు విడుదల అవుతుందని మేం మేలోనే చెప్పాం. చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతికి విడుదల అని.. జూన్‌లో చెప్పారు. అలానే బాలకృష్ణ వాల్తేరు వీరయ్య.. డిసెంబర్‌కి రిలీజ్ అని ప్లాన్ చేసుకున్నారు. కానీ వర్క్ అవ్వకపోవడం వల్లనో.. సంక్రాంతి అడ్వాంటేజ్‌ని తీసుకునో తెలియదు కానీ.. వాళ్లు కూడా సంక్రాంతికే విడుదల అన్నారు’’ అని తెలిపాడు.
‘‘ఇక చిరంజీవి, బాలయ్య నటిస్తోన్న సినిమాలు రెండు మైత్రీ వాళ్లవే. ఇక వారసుడు వివాదం విషయంలో మైత్రీ వాళ్లకు లేని వివాదం.. వేరే వాళ్లకు ఎందుకు. అంతేకాదు ఈ వివాదం వెనక ఎవరెవరున్నారు.. ఎందుకు చేస్తున్నారు అన్నది నాకు మొత్తం తెలుసు. కానీ నేను ఎప్పుడూ వారిని డైరెక్ట్‌గా ఏం అనలేదు. ఓపెన్‌గా నేను ఎవరినీ కౌంటర్ చేయను.. చేయలేదు. కానీ వాళ్లే కావాలని దీన్ని వివాదం చేస్తున్నారు’’ అని కామెంట్స్ చేశాడు దిల్ రాజు. ఆయన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. మరి సంక్రాంతికి వారసుడు విడుదల అవుతుందో లేదో చూడాలి మరి.