తెలుగు చలన చిత్ర రంగంలో పవర్‌ఫుల్ అత్తగా ఎన్నో చిత్రాల్లో నటించిన సూర్యకాంతం పేరుపై పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కవరు విడుదల చేయనుంది. ఈ నెల 18న ఆ కవర్ ఆవిష్కరించనున్నట్టు కాకినాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యకాంతం పేరున కాకినాడలోని సత్కళావాహినిలో ‘ప్రత్యేక తపాలా చంద్రిక ఆవిష్కరణ’ జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి, మేయర్ సుంకర శివప్రసన్న, విశాఖ రీజియన్ పోస్టుమాస్టర్ జీఎం వెంకటేశ్వర్లు హాజరు కానున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సూర్యకాంతం.. 1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో జన్మించారు. సూర్యకాంతం కాకినాడ యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్‌లో నాటకాలు వేసేవారు. అక్కడే అంజలి, ఆదినారాయణరావు, ఎస్వీ రంగారావు లాంటి నటులతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
సూర్యకాంతం తొలి రోజుల్లో చిన్న చిన్న గుర్తింపు లేని పాత్రలే వేసేవారు. గోదావరి వరదలా సంభాషణలు వల్లించగల సామర్థ్యం ఉన్న ఆమె ‘ధర్మాంగత’ చిత్రంలో మూగపాత్ర లో నటించారు. అయితే హీరోయిన్‌గా నటించినా ఆ చిత్రంలో మాటలు లేకపోవడంతో అంతగా గుర్తింపు రాలేదు. 1950లో ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ హీరోలుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘సంసారం’ అనే సినిమా సూర్యకాంతం కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ చిత్రంలో కయ్యాలమారిగా.. గయ్యాళి గంపగా చేసిన పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. అక్కడి నుంచి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె కోసమే పాత్రల్ని సృష్టించేవారు అంటే అతిశయోక్తి కాదు.
అగ్రహీరోలు ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ నటించిన చిత్రంలోని ఆమె పాత్ర పేరుతోనే ‘గుండమ్మ కథ’ తీశారంటే సూర్యకాంతం నటన స్థాయిని అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో గయ్యాళి పాత్రలో రాక్షసిలా కనిపించినా.. నిజ జీవితంలో నలుగురికి కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణ అని ఆమె గురించి తెలిసిన వారు చెబుతుంటారు. అత్తగారి పెత్తనం ప్రదర్శించే పాత్రలో తెలుగువారి మదిలో పదిలమైన సూర్యకాంతం 1994 డిసెంబరు 18న కన్నుమూశారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ గుర్తుండిపోయే అతి తక్కువ మంది కళాకారుల్లో సూర్యకాంతం ఒకరు.