స్టార్ హీరోలు కలిస్తే వాళ్లకు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫ్యాన్స్ కళ్లకు మాత్రం చాలా నిండుగా ఉంటుంది. అది ఆనందకర సందర్భం అయితే పర్వాలేదు కానీ విషాదకర సందర్భం అయితే వాళ్లని చూస్తున్న మనం కూడా బాధపడతాం. ఎందుకంటే సిట్చూయేషన్స్ అలా మారతాయి మరి. ఇప్పుడు కూడా తాజాగా అలాంటి దృశ్యమే కనిపించింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాన్ని సదరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన భావాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. తెలుగు చలనచిత్ర సీమకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ప్రస్తుత హీరోలకు ఎందరికో స్పూర్తిగా నిలిచారు. అయితే కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చే టైంలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. సినిమాల పరంగా పోటీ ఎప్పుడున్నా సరే వ్యక్తిగతంగా మాత్రం వాళ్లు మంచి మిత్రులే! అప్పట్లో ఓ సినిమా సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు కలిశారు. ఆ ఫొటోనే ఇప్పుడు వైరల్ గా మారింది.
మరోవైపు కృష్ణ మరణంతో సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. కృష్ణ కుమారుడు మహేశ్ ని నాగేశ్వరరావు మనవడు నాగచైతన్య, ఎన్టీఆర్ మనవడు జూనియర్. ఎన్టీఆర్ పరామర్శించారు. ఆ ముగ్గురు పక్కపక్కనే కూర్చున్న సమయంలో ఫొటో తీశారు. గతంలో కృష్ణ, ఏఎన్నార్, ఎన్టీఆర్ ఫొటోతో దీన్ని పోల్చుతూ.. సదరు హీరోల అభిమానులు ఈ పిక్ ని ట్రెండ్ చేస్తున్నారు. సందర్భం కాకపోయినా సరే ఓ చోట స్టార్ హీరోల వారసులు కలవడమనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.