దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార.. ఈ ఏడాది జూన్ లో డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐదేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్ళైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ.. సరోగసి విధానం ద్వారా పిల్లలను కనడమే ప్రస్తుతం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సరోగసి విధానం అంటే.. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడమే. అయితే.. ఇప్పుడీ సరోగసి విధానమే నయన్ దంపతులను చిక్కుల్లో పెట్టింది. 2019లోనే సుప్రీం కోర్టు సరోగసీ ద్వారా పిల్లలను కనడం నేరమని స్పష్టతనిచ్చింది.
ఇక సరోగసీ విధానంపై ఈ ఏడాది జనవరిలో కూడా నిషేధం విధించింది భారత ప్రభుత్వం. అదికూడా సరోగసి ద్వారా పిల్లలను కనేందుకు కొన్ని చట్టపరమైన రూల్స్ కూడా ఉన్నాయి. దీంతో పెళ్ళైన నాలుగు నెలలకే కవలలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు అన్ని రూల్స్ పాటించారా లేదా? అనేది చర్చలకు దారి తీసింది. అదీగాక సరోగసి ద్వారా పిల్లలను కనాలంటే.. పెళ్ళై కనీసం మూడేళ్లు పూర్తై ఉండాలి. అలాగే దంపతులకు పిల్లలు పుట్టకపోవడమో లేదా పిల్లలు కనడం ఇష్టం లేకపోవడం.. ఇలా ఏదో ఖచ్చితమైన కారణాలు, ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఈ విధమైన రూల్స్ పట్ల నయన్ దంపతులు హద్దులు మీరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పును లెక్క చేయకుండా నయన్ దంపతులు సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు.
మరి చట్టపరమైన రూల్స్ ని పాటించారా లేదా అనే విషయంపై వివరణ కోరతామని ఇప్పటికే తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రహ్మణ్యన్ ప్రకటించారు. ఒకవేళ చట్టపరమైన పద్ధతులు పాటించకుండా నయన్ దంపతులు సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చినట్లైతే.. వారికి కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం లేకపోలేదని కోలీవుడ్ న్యాయనిపుణులు చెబుతున్నారు. అంతేగాక.. సరోగసీ కాదు.. పిల్లలను దత్తత తీసుకున్నాం అని చెప్పడానికి కూడా వీలు లేదు. దానికి కూడా సమస్యలు తప్పవని సమాచారం. పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా చట్టపరమైన పద్ధతులున్నాయి. అయితే.. ఈ వివాదంపై నయన్ దంపతులు ఇంకా స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికే పుట్టిన పిల్లల విషయంపై నయన్ దంపతులు వివరణ ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీచేసినట్లు తెలుస్తుంది. చూడాలి మరి నయన్ దంపతులు ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో!