శారీరక ఆరోగ్యం ప్రాధాన్యత ఏంటనేది ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసొస్తోంది. కరోనా కారణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అందరూ శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్టార్ నటి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
కరోనాతో ఫిట్నెస్ విలువ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి వ్యాధినైనా తరిమికొట్టొచ్చని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపడం లేదు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి లాంటి వాటి వల్ల చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శారీరక ఆరోగ్యంతోనే మానసిక ఆరోగ్యం సాధ్యం అని చెబుతూ సినీ నటి, మిస్ ఆసియా టైటిల్ విన్నర్ ఆకాంక్ష సింగ్ ఓ వినూత్న ప్రయత్నం చేసింది. ట్రెడ్మిల్ మీద 9 గంటల పాటు నిరంతరాయంగా నడక కార్యక్రమాన్ని చేపట్టిందామె.
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆకాంక్ష ట్రెడ్ మిల్‌పై ఉత్సాహంగా నడిచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది. ‘మానసిక కుంగుబాటు కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసిక ఆరోగ్యం కూడా సాధ్యం. నా తల్లి కూడా ఇలాగే మానసిక కుంగుబాటుకు గురై అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి మిగతా మహిళలకు రాకూడదని.. వారిలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ట్రెడ్ మిల్ మీద 9 గంటల పాటు నడిచా. ప్రతి మహిళ తమ ఆరోగ్యం కోసం ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి’ అని ఆకాంక్ష సింగ్ చెప్పుకొచ్చింది. మరి.. ఆకాంక్ష ప్రయత్నంతో మహిళల్లో ఆరోగ్యంపై స్పృహ పెరుగుతుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.