మాస్ మహారాజా రవితేజ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చిన పుకార్లు నిజమయ్యాయి. మాస్ జాతర సినిమా విడుదల వాయిదా పడింది. తిరిగి ఎప్పుడనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొన్ని రోజుల వ్యవధిలో విడుదలయ్యేందుకు చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇందులో కీలకమైంది మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా మాస్ జాతర. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఊహించినట్టే సినిమా విడుదల వాయిదా పడింది. రేపు ఆగస్టు 27న విడుదల కావల్సిన సినిమా వాయిదా పడనుందని ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్నా అధికారికంగా నిర్మాతలు ఇవాళ ప్రకటించారు. సినిమా ఎందుకు వాయిదా పడిందో కూడా వివరించే ప్రయత్నం చేశారు.
ఇండస్ట్రీలో జరుగుతున్న సమ్మె కారణంగా మాస్ జాతర సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలావరకు నిలిచిపోయాయి. దాంతో సినిమాను తప్పని పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వస్తోందని నిర్మాతలు ప్రకటించారు. ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించే ఉద్దేశ్యంతో మరింత సమయం తీసుకుంటున్నామని చెప్పారు. తిరిగి ఎప్పుడు విడుదల చేసేది త్వరలో ప్రకటిస్తామన్నారు. అభిమానులు ఊహించినదానికంటే మంచి కంటెంట్‌తో సినిమా రానుందని చెప్పారు.
సూపర్ హిట్ సినిమా ధమాకా తరువాత రవితేజ శ్రీలీల జంటగా చేసిన సినిమా ఇది. రవితేజకు ఇది 75వ సినిమా కాగా భోగవరపు భాను తెరకెక్కించారు. సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.