బేబి సినిమాలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆమెను రేప్ చేస్తామని బెదిరించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు అదరగొడుతున్నాయి. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద కురిపిస్తున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో ఓ చిన్న సినిమాగా విడుదలై సంచలనాన్ని క్రియేట్ చేసిన మూవీ ‘బేబి‘. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ సినిమా కథ గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకంటే సినిమాలో చాలా వరకు బోల్డ్ కంటెంట్ ఉంది. ప్రస్తుతం యువతరం ప్రేమ పేరుతో ఎదుర్కొంటున్న పరిస్థితులను కల్ట్ వే లో ప్రజెంట్ చేశారు డైరెక్టర్ సాయి రాజేష్. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వైష్ణవి చైతన్య పై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆమె పోస్టర్స్ చింపేస్తూ బండ బూతులు తిడుతున్నారు. ఇలాంటి అనుభవమే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన కిర్రాక్ సీతకు కూడా ఎదురైంది.
ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. కొంతమంది తనను రేప్ చేస్తామని.. కనబడితే చంపేస్తాం అంటూ బెదిరించారని ఆమె వెల్లడించింది. ఒక ఈవెంట్ కి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. కొంతమంది అబ్బాయిలు తన వెంటపడ్డారని, ఆ సమయంలో భయం వేసి ఫ్రెండ్స్ కి కాల్ చేశానని అన్నారు. ఫ్రెండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారని, కానీ తాను ఫోన్ చేయలేదని అన్నారు. వాళ్ళు తనని రేప్ చేస్తామని, కనపడితే చంపేస్తాం అంటూ బెదిరించారని, తన అడ్రస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటిది ముందే జరుగుతుందని డైరెక్టర్ తనతో చెప్పారని కిర్రాక్ సీత తెలిపింది.
ఇక సీత గతంలో పలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది. బేబి సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమా కల్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఇందులో నటించిన నటీనటులకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ పై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ముగ్గురు వారి నటనతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కలెక్షన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ మూవీ రూ.66 కోట్ల రాబట్టిందని సమాచారం. ఇలాగే కొనసాగితే 100 కోట్లు సాధిస్తుందని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్ బేబి టీమ్‌ను ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి అభినందించిన విషయం తెలిసిందే.