KGF Thatha Krishna Ji Rao: కేజీఎఫ్ కత్తి అయితే… కేజీఎఫ్ 2 అమ్మోరు కత్తి అన్న టాక్ ఇప్పటికీ నడుస్తోంది. కేజీఎఫ్ 2 మొదటి రోజే దేశవ్యాప్తంగా 170 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటివరకు 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. కలెక్షన్ల పరంగానే కాదు నటన పరంగా కూడా చాలా మందికి లైఫ్ ఇచ్చింది కేజీఎఫ్ సినిమా. పదుల సంఖ్యలో సినిమాలు తీసినా రాని ఫేమ్ ఒక్క సినిమాతో వచ్చేసింది. అలా ఫేమ్ తెచ్చుకున్న వారిలో కేజీఎఫ్ తాత ఒకరు. ఆయన అసలు పేరు కృష్ణాజీ రావు. ఆంధ్ర-కర్ణాటక బార్డర్‌లో పుట్టారాయన. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ సినిమాలు చూసి తానూ ఓ నటుడు అవ్వాలనుకున్నారు. సినిమా మీద ఆసక్తితో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. కానీ, ఎలాంటి అవకాశాలు రాలేదు. తర్వాత డైరెక్టర్ల చుట్టూ అవకాశాల కోసం తిరిగారు. ‘ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్!’’ అని ఆయన అడగటం.. ‘చూద్దాం పో!’ అని వాళ్లు చెప్పటం పరిపాటిగా మారింది.
సినిమా వాళ్లకు బట్టలు కుట్టే తన మిత్రుడితో చేరారు. టైలర్‌గా పని మొదలుపెట్టారు. ఒక పాయింట్ కుడితే అప్పట్లోనే ఎనిమిది రూపాయలు ఇచ్చేవారు. అక్కడ బీఎమ్ వెంకటేశ్ అనే హీరో, నిర్మాతతో పరిచయం ఏర్పడింది. ఆయన తాను చేస్తున్న సినిమాలో కృష్ణాజీకి మేనేజ్‌మెంట్ చేసే అవకాశం ఇచ్చారు. ఒక నెల చేసిన తర్వాత కమలహాసన్ మేకప్ మ్యాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన తన దగ్గర టచ్‌బాయ్‌గా పెట్టుకున్నారు. ఆ తర్వాత శాంతారామ్ అనే డైరెక్టర్ దగ్గర అసిస్టంట్‌గా చేరారు. అన్ని పనులు తానై చేసేవారు. తర్వాత శంకర్‌నాగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆయనతో పాటు స్టోరీ డిస్కసన్‌లకు వెళ్లే వారు. ఓ రోజు శంకర్ నాగ్ కృష్ణాజీని తన దగ్గర పని చేయమని అడిగారు. ఆయన ఒకే అన్నారు. ఆ సాయంత్రమే 2వేల రూపాయల చెక్కు ఇచ్చారు. మొట్ట మొదటి సారి అంత పెద్ద మొత్తంలో డబ్బులు చూసిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
శంకర్ నాగ్‌తో సినిమా తర్వాత కొన్ని సినిమాలకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రొవిజినల్ మేనేజర్ కుమార్ కేజీఎఫ్ సినిమా కోసం ఫొటో పంపించమని కృష్ణాజీని అడిగారు. కానీ, ఆయన స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉండి యాక్టింగ్ నాకెందుకు అనుకున్నారు. అయితే, ఓ రోజు కుమార్ స్వయంగా కృష్ణాజీ ఫొటోను కేజీఎఫ్ ఆడిషన్స్‌కు పంపారు. తర్వాత ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. అక్కడకు వెళ్లారు. అసోసియేట్ డైరెక్టర్ డైలాగ్ ఇచ్చి చెప్పమన్నారు. ఆయన చెప్పారు. తర్వాత చెప్తాం వెళ్లిపోమన్నారు. ఆయనకు ఏమీ అర్థం కాలేదు. మళ్లీ ఐదు రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. ఈ సారి విత్ మేకప్ కెమెరా ముందు నిల్చోబెట్టారు. ప్రశాంత్ నీల్ ఆయనకు ఆడిషన్స్ చేశారు. కొన్ని రోజుల తర్వాత సెలెక్ట్ అయ్యావని, కేజీఎఫ్‌కు(ఒరిజినల్ కోలార్ గనులు) రమ్మని కాల్ వచ్చింది. తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నారు. కేజీఎఫ్‌లో బానిస అంధ వృద్ధుడిగా నటించారు. ఈ సినిమాతో ఆయన లైఫ్ మొత్తం మారి పోయింది. మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అవకాశాల్లో బిజీగా ఉన్న ఈ తరుణంలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.