సినిమా స్టార్స్ అనగానే వాళ్ల లగ్జరీ లైఫ్ గుర్తొస్తుంది. వాళ్ల లైఫ్ స్టైల్ చూసి ఆహా ఓహో అని మురిసిపోతాం. కొందరైతే కుళ్లుకుంటారు కూడా. కట్ చేస్తే వాళ్లు మనలాంటి మనుషులే. మనకు ఎన్నో బాధలున్నట్లే సదరు హీరో లేదా హీరోయిన్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ భరిస్తూ ఉంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతూ ఉంటారు. ఇక రీసెంట్ టైంలో స్టార్ హీరోయిన్ సమంత.. ‘మయోసైటిస్’ వ్యాధి బారిన పడ్డానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా వచ్చే ఈ వ్యాధి వల్ల కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి నిల్చున్న చోటు నుంచి కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆటో ఇమ్యూన్ తోపాటు వైరస్, కొన్ని మందుల ప్రభావంతోనూ మయోసైటిస్ వస్తుంది. ప్రస్తుతం హీరోయిన్ సమంత.. దీనికి చికిత్స తీసుకుంటోంది. ఈ వ్యాధితో బాధపడుతూనే ‘యశోద’ మూవీకి సామ్ డబ్బింగ్ కూడా చెప్పింది. తాజాగా థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజైంది. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్ పియా బాజ్ పాయ్, తను కూడా ఈ వ్యాధి బారిన పడ్డట్టు బయటపెట్టింది. కొన్నేళ్ల ముందు దీనితో పోరాడినట్లు చెప్పుకొచ్చింది.
‘నేను కూడా మయోసైటిస్ బాధితురాలినే. అది చికిత్స లేని వ్యాధి. నాకు ఆ రోగం ఉందని తెలియగానే మా ఇంట్లో ఎవరికీ తెలియకుండా చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాను. ప్రస్తుతం సమంత పడుతున్న బాధని అర్థం చేసుకోగలను. నేనైతే ముంబయిలో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నాను. దీన్ని జయించాలంటే చాలా మనోధైర్యం కావాలి. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.’ అని పియా బాజ్ పాయ్ చెప్పింది. ఇదిలా ఉండగా తెలుగులో ‘నిన్ను కలిశాక’, ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’, ‘దళం’ సినిమాల్లో ఈమె హీరోయిన్ గా చేసింది. కానీ తమిళ డబ్బింగ్ చిత్రం ‘రంగం’తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘లాస్ట్’ అనే హిందీ సినిమాలో చేస్తోంది. అయితే ఈమెకే క్యూర్ అయిపోయింది కాబట్టి సమంత కూడా త్వరలోనే కోలుకుంటుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.