ఇండస్ట్రీలో పెద్దరికం.. గత కొద్ది రోజుల నుంచి ఇదే అంశంపై తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా చర్చ నడుస్తోంది. దీనిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని స్పష్టం చేశారు. కానీ ఆపదలో ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా స్పందిస్తానని కూడా చిరంజీవి తెలిపారు. ఇక చిరు వ్యాఖ్యలను ఉద్దేశించి సీనియర్ హీరో మోహన్ బాబు స్పందిస్తూ ఓ బహిరంగా లేఖ రాశారు.
మోహన్ బాబు లేఖపై చాలా మంది ప్రముఖులు సైతం చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీ పెద్దరికం అంశంపై సీనియర్ హీరో సుమాన్ మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. తిరుపతిలో జరిగిన మీడియాలో సమావేశంలో పాల్గొన్న ఆయన.. నేను సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్ల అవుతుందని, 10 భాషల్లో దాదాపుగా 600పైగా సినిమాల్లో నటించానని తెలిపారు. స్వయం కృషితో ఎదిగానని అన్నారు.అయితే సినిమా పరిశ్రమలో ఐక్యత లేదనడం అవాస్తవమని, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి సీనియర్ లు ఉన్నారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న సినిమా టికెట్ల ధరలను ఉద్దేశించి ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఇక దీంతో పాటు సినిమా సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదని కూడా సుమాన్ వ్యాఖ్యనించారు.