స్టీల్ ప్లాంటా? షిప్ యార్డా? ఏష్ యార్డా? జింకా? బంకా? అని బొక్కులోది నాలుగైదు కంపెనీ పేర్లు చెప్పి.. ఉద్యోగం పేరుతో మోసాలు చేసే సమోసా గాళ్ళు చాలా మందే ఉంటారు. ఉద్యోగం ఎందులో కావాలో చెప్పండిరా బాబూ. మీకు ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మరేటి మీరు? ఏటి నమ్మరా మీరు. నాకు పెద్ద పెద్దోళ్ళందరూ పరిచయం ఉన్నార్రా బాబూ.. అని చెప్పి డబ్బులు తీసుకుని జంప్ అవుతారు. ఈ భూ పెపంచకంలో మనుషుల్ని ఈజీగా మోసం చేయడానికి దుర్మార్గులు వాడే అస్త్రం ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడం. జనాల జీవితాల్లో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. దేన్నైనా తట్టుకోవచ్చు గానీ మోసాన్ని మాత్రం ఎవరూ తట్టుకోలేరు. మోసం ఎక్కడైనా ఉంటుంది. దానికి సినీ పరిశ్రమ, ఆ పరిశ్రమ, ఈ పరిశ్రమ అని తేడా లేదు. మోసం చేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు.
తాజాగా సినీ హీరోయిన్ ఉద్యోగం పేరుతో ఒక మహిళను మోసం చేసిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బంగారు ఆభరణాల దుకాణంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళ దగ్గర రూ. 30 వేలు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒడిశా ఇండస్ట్రీకి చెందిన వర్ష ప్రియదర్శిని పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. జోర్, గోల్మాల్, లవ్ స్టోరీ, రోమియో జూలియట్ వంటి అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఒడియాలోనే కాకుండా బెంగాలీ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. ఈమె ఒడిశాకి చెందిన ఎంపీ అనుభవ్ మహంతి భార్య.
సినిమా, రాజకీయ నేపథ్యం ఉన్న ఈమెపై ఒక మహిళను ఉద్యోగం పేరుతో మోసం చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. మహిళకు ఆమెకు జ్యువలరీ షాప్ లో ఉద్యోగం ఇప్పిస్తానని.. ప్రియదర్శిని, ఆమె అసోసియేట్ ఆయుషి ఇద్దరూ కలిసి రూ. 30 వేలు అడిగారని, ఆ డబ్బు చేతికి అందాక అందుబాటులో లేరని కళ్యాణి నాయక్ వెల్లడించారు. ఈ మేరకు హీరోయిన్ వర్ష ప్రియదర్శిని, ఆమె అసోసియేట్ ఆయుషిపై భువనేశ్వర్ లోని షాహీద్ నగర్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఫైల్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ హీరోయిన్ వర్ష ప్రియదర్శిని స్పందించలేదు.