రాజకీయం అనేది చదరంగం లాంటిది.. ఎప్పుడు ఏ పార్టీవారు ఏ వ్యూహాన్ని అమలుపరచి అధికారం దక్కించుకునే ప్రయత్నం చేస్తారో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడున్న దేశ రాజకీయాల దృష్ట్యా బీజేపీ పార్టీ ఈసారి అన్నివిధాలా పైచేయి సాధించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓవైపు తెలంగాణలో అధికారం కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది బీజేపీ. పాలిటిక్స్ అన్నాక జనాలను అప్రోచ్ అయ్యేందుకు కొన్ని వ్యూహాలుంటాయి. అయితే.. తెలంగాణలో బీజేపీని హైలైట్ చేస్తూ, జనాల దృష్టిలో పడేందుకు ఇప్పుడు సినీ గ్లామర్ ని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ ని బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా భేటీ అయిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లోని నోవాటెల్ లో హీరో నితిన్ కి, నడ్డాకి మధ్య దాదాపు గంటకు పైగా చర్చలు నడిచాయి. దీంతో నితిన్ రాజకీయంగా బీజేపీకి మద్దతు ఇవ్వనున్నాడా? అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. బీజేపీ అప్రోచ్ అవ్వాలనుకుంది నితిన్ ని కాదు నిఖిల్ ని అని చర్చ. ఎందుకంటే.. ఇండస్ట్రీలో నితిన్ తో పాటు నిఖిల్ కూడా స్టార్డమ్ ఉన్న హీరోనే. అదీగాక నిన్నామొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో కాదు. ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే.. కార్తికేయ సినిమాలో బీజేపీకి అనుకూలమైన హిందుత్వం, శ్రీకృష్ణుడు, కృష్ణతత్వం.. లాంటివి పుష్కలంగా ఉన్నాయి. దీంతో నిఖిల్ అయితే బీజేపీకి హెల్ప్ ఫుల్ గా ఉంటుందనే భావనతో హైకమాండ్ నిఖిల్ ని సజెస్ట్ చేసిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కలవాలని అనుకుంటే నేరుగా నిఖిల్ కలిసే అవకాశం ఉంది. తెలుగు ఇండస్ట్రీలో నిఖిల్, నితిన్ ఇద్దరూ చాలా సినిమాలు చేశారు. మంచి స్టార్డమ్ ఉన్న హీరోలు. అంతటి పాపులారిటీ ఉన్న హీరోల పేర్ల విషయంలో బీజేపీ పార్టీ శ్రేణులు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదని.. జేపీ నడ్డా నితిన్ కలవడం ప్రణాళికబద్దంగానే జరిగిందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. నితిన్ తెలంగాణకు చెందిన హీరో.. అందులోనూ బీజేపీ ప్రస్తుత టార్గెట్ తెలంగాణ కాబట్టి.. బీజేపీ శ్రేణులు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, పూర్తి స్పృహతోనే నితిన్ కలవడం జరిగిందనేది మరో వాదన. మరి బీజేపీ టార్గెట్ తెలంగాణ రాజకీయం అయినప్పుడు.. నితిన్, నిఖిల్ పేర్లలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ అంటే.. పార్టీ నేతలు కూడా కలవబోయే సెలెబ్రిటీల నేపథ్యాన్ని కనుక్కునే ఉంటారు. మరి బీజేపీ నితిన్ ని భేటీ అవ్వడం వెనుక ఈ విధంగా రెండు వెర్షన్స్ కథనాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి.