ఇటీవల సినిమాల విడుదల అనేది చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో వారానికి రెండు మూడు సినిమాలు విడుదలైతే.. కొన్ని నెలలుగా వారానికి ఐదు లేదా ఆరు సినిమాల వరకు రిలీజ్ అవుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా కరోనా తర్వాత త్వరగా కోలుకున్న ఇండస్ట్రీ టాలీవుడ్ ఒక్కటే. ఆ తర్వాతే మిగతా ఇండస్ట్రీలన్నీ థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే.. పెద్ద హీరోల సినిమాలు క్లాష్ అవుతున్నాయంటే.. చిన్న సినిమాలన్నీ తప్పుకునేవి. కానీ.. ఇప్పుడలా కాదు.. కంటెంట్ ప్రధానంగా సినిమాలు ఆడుతున్నాయి అనే ధైర్యంతో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి.
ఇక 2022 ఏడాది పూర్తయిపోయి.. 2023కి గ్రాండ్ గా స్వాగతం పలకాల్సిన సమయం మరికొద్ది రోజులే ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో సినీ ప్రియులను థియేటర్స్ లో అలరించేందుకు దాదాపు 20 సినిమాలు రెడీ అయిపోయాయి. పెద్ద సినిమాలన్నీ జనవరిలో సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా.. మీడియం, చిన్న సినిమాలన్నీ డిసెంబర్ లోనే సందడి చేసేందుకు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. కాగా.. ఇప్పటివరకు ఈ ఏడాదిలో నెలకు 15 సినిమాల వరకు రిలీజ్ అవ్వడం చూశాం. కానీ.. ఇప్పుడు డిసెంబర్ ఒక్క నెలలోనే ఏకంగా 20 సినిమాలు రిలీజ్ కాబోతుండటం విశేషం. ఈ నెలలోనే క్రిస్మస్ కానుకగా హాలీవుడ్ ‘అవతార్ 2’ మూవీ కూడా రిలీజ్ కానుంది.