ప్రముఖ తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. వాహనం అద్దాలు పగులగొట్టి మరీ దొంగతనం చేశారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో బెల్లంకొండ సురేష్ ఒకరు. ‘చెన్నకేశవ రెడ్డి’, ‘లక్ష్మీ నరసింహ’, ‘కందిరీగ’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలపై మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌గా ఆయనకు పేరుంది. స్ట్రయిట్ తెలుగు చిత్రాలను నిర్మించడమే గాక కంటెంట్ బాగున్న ఇతర భాషా చిత్రాలను తెలుగులోకి అనువదించి రిలీజ్ చేస్తుంటారు బెల్లంకొండ సురేష్. ఈ క్రమంలోనే ‘కాంచన 2’ లాంటి కొన్ని హిట్స్‌ను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. అయితే గత కొంత కాలంగా నిర్మాతగా ఇతర హీరోలతో పెద్దగా సినిమాలు చేయట్లేదు బెల్లంకొండ సురేష్. తన వారసుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తోనే మూవీస్ చేస్తున్నారాయన.
ఈ మధ్యే బెల్లంకొండ సురేష్ మరో తనయుడు గణేష్ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ నేపథ్యంలో తన వారసులను నిలదొక్కుకునేలా చేయడంపై ఆయన దృష్టి పెట్టారు. ఇదిలా ఉండగా.. బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయన కారు అద్దాలు పగులగొట్టి కొంత నగదు, ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లాడు. కారు లోపల ఉంచిన రూ.50 వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలను దొంగిలించాడు. ఒక్కో మద్యం సీసా ఖరీదు సుమారుగా రూ.28 వేలు అని తెలుస్తోంది. ఈ చోరీపై జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ దొంగతనంపై బెల్లంకొండ సురేష్ సతీమణి పద్మావతి తమకు కంప్లయింట్ చేశారని.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.