భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ వైపు వెండితెరపై నటిస్తూనే.. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎంతటి స్టార్ హీరో అయినా కొన్ని సంఘటనలు, చిత్రాలు, పాటలు విన్నా.. చూసినా భావోద్వేగానికి గురి అవుతుంటారు.. వారికి తెలియకుండానే కంటతడి పెడుతుంటారు.
అలాంటి సంఘటన తన జీవితంలో జరిగిందని.. సూర్య హీరోగా వచ్చిన ‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) సినిమాలోని అందని ఆకాశం దించవయ్యా మాకోసం ( కయ్యిలే ఆగాశమ్.. కొండు వంద ఉన్ పాసమ్) అనే పాట వింటూ కంటతడి పెట్టానని బిగ్ బీ తన బ్లాగ్లో రాశారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ చిత్రం భారీ స్పందనను పొందింది. తెలుగు లో ఆకాశం నీ హద్దురా రిలీజ్ అయ్యింది. తాను ఈ సినిమాలోని ఆ పాట విన్నప్పుడు తన కన్నీళ్లను ఆపుకోవడానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదని పేర్కొన్నారు.
ఆ పాట విన్నప్పుడల్లా కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని చెప్పారు. తన జీవితంలో ఎన్నో చిత్రాల్లో నటించానని.. ఎన్నో చిత్రాలు వీక్షించానని.. అయితే అందులో కొన్ని తన మనసుకు హత్తుకునే సన్నివేశాలు, పాటలు ఉన్నాయని అన్నారు. అయితే సూర్య నటించిన ఈ పాటలో గుండెను పిండేసే భావోద్వేగం ఉందని తెలిపారు. సహజత్వానికి దగ్గరగా ఈ పాట ఉందని అన్నారు. తనతో ఈ ఎమోషన్ చాలాకాలం ఉండిపోతుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. అమితాబ్ స్పందించిన తీరుకి ఆ సినిమా బృందం ధన్యవాదాలు తెలిపింది.
