ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలో ఉంటున్న ఆయనని దగ్గరలో ఉంటున్న అపోలో హాస్పిటల్ కి తరలించగా.. ప్రస్తుతం అక్కడే వైద్యసేవలు కొనసాగుతున్నాయి. అయితే.. శరత్ కుమార్ అస్వస్థతకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని సమాచారం. మరోవైపు ఆయన డీహైడ్రేషన్ కి గురయ్యారని అంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు నటి రాధికా, కూతురు వరలక్ష్మి ఇద్దరూ హాస్పిటల్ వద్దే ఉన్నారు. శరత్ కుమార్ హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసి తమిళ సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
ఇక నటుడిగా శరత్ కుమార్ గురించి అటు తెలుగు, ఇటు తమిళ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన.. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. తెలుగులో రీసెంట్ గా చాలా సినిమాలలో తండ్రి, విలన్ రోల్స్ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ తో పాటు వారసుడులో కూడా కీలకపాత్ర పోషించారు. అయితే.. వీటన్నింటికంటే ముందు శరత్ కుమార్.. తెలుగులో బన్నీ, కాంచన, జయజనాకి నాయక లాంటి సినిమాలలో ఆయన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.
ఇదిలా ఉండగా.. శరత్ కుమార్ రెండు రోజులుగా డయేరియాతో బాధపడుతున్నారట. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న టైమ్ లో శరత్ కుమార్ అనారోగ్యానికి గురయ్యారని.. డయేరియా వల్లే ఆయన డీహైడ్రేషన్ కి గురైనట్లు వైద్యులు తెలిపారు. దీంతో హాస్పిటల్ లో చేరిన ఆయనకు వెంటనే ఫ్లూయిడ్స్ ను ఎక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఈరోజు డాక్టర్లు హెల్త్ బులెటిన్ అందించనున్నారని కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. శరత్ కుమార్ ఫ్యామిలీకి సన్నిహితంగా మెలిగే సినీ ప్రముఖులు ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది.