”నిద్రలో కనేది కల.. నిద్ర లేపేది కళ” మరి అలాంటి కళను కళ్లకు కట్టినట్లుగా చూపించడం ఓ కళాకారుడిగా మామూలు విషయం కాదు. అందుకే సినిమాకి డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. కెప్టెన్ సరిగ్గా లేకపోతే షిప్ మునిగిపోవడం జరుగుతుంది. అలాగే డైరెక్టర్ సరిగ్గా సినిమా తీయకపోతే.. ఎంతటి అద్భుతమైన కథ అయినా సరే ప్రేక్షకులు నిలువునా ముంచుతారు. మరి అలాంటి బాధ్యతను భూజాన వేసుకున్న డైరెక్టర్.. అనుకున్న కథను వెండితెరపైకి తీసుకురావడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారో కదా. మరి ఈ 2022లో తమ ఫస్ట్ మూవీస్ తోనే వెండితెరపై తమదైన ముద్ర వేసుకున్న దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండస్ట్రీలో ఓ దర్శకుడి ఫస్ట్ మూవీ వస్తుందంటే వారిపై భారీ అంచనాలు ఉంటాయి. ఇక అదే పెద్ద హీరోతో సినిమా అంటే.. ఉండే ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి వీటన్నింటిని దాటుకుని వచ్చి వెండితెరపై హిట్ కొట్టడం సాహసమనే చెప్పాలి. అయితే సాహసాలు చేస్తేనే జీవితంలో నిలబడేది. అలా సాహసాలు చేసే నిలబడ్డారు ఈ కొత్త దర్శకులు. వారి విజయాలకు ప్రధాన కారణం వారు ఎంచుకున్న సబ్జెక్ట్సే. వైవిధ్యమైన కథల ఎంపికే వారిని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది అని చెప్పాలి. మరి వారెరో ఇప్పుడు చూద్దాం.
2022లో ప్రేక్షకులను భయపెట్టిన సినిమా ఏది అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు ‘మసూద’. గతంలో దెయ్యం బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ.. ఇంత ఎంగేజింగ్ గా, ఇంత సస్పెన్స్ గా వచ్చిన చిత్రాలు లేవనే చెప్పాలి. డైరెక్టర్ సాయి కిరణ్ కు ఇది తొలి చిత్రమే అయినప్పటికీ ఓ సీనియర్ డైరెక్టర్ లాగా తీశాడు. తన తొలి సినిమాతోనే ఇండస్ట్రీని మెుత్తం తనవైపు తిప్పుకునేలా చేశాడు ఈ డెబ్యూ డైరెక్టర్.
ఈ ఏడాది వెలుగులోకి వచ్చిన డైరెక్టర్స్ అందరిలో కెల్లా కూసింత ప్రతిభ ఎక్కువ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మల్లిడి వశిష్ఠ్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఎవరైనా తొలి సినిమాని కమర్షియల్ గానో లేదా లవ్ స్టోరీనో తీయ్యాలి అనుకుంటారు. ఎందుకంటే అవి సేఫ్ జోనర్స్ కాబట్టి. కానీ వశిష్ఠ్ వీటి జోలికి పోలేదు. సోషియో ఫాంటసీ జోనర్ ను ఎన్నుకున్నాడు. పైగా పెద్దగా ఫామ్ లో లేని హీరో కళ్యాణ్ రామ్ ను హీరోగా ఎన్నుకున్నాడు. కానీ కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటనకి, తన టేకింగ్ ను జోడించి ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఫలక్‌నుమాదాస్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చేసిన విద్యాసాగర్.. ఆ తర్వాత మెగాఫోన్ పట్టుకున్నాడు. ఎనర్జిటిక్ హీరో విశ్వక్ సేన్ ను హీరోగా పెట్టి ఓ డీసెంట్ హిట్ కొట్టాడు. అందే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అద్భుతమైన స్టోరీని అంతే అద్భుతంగా తెరకెక్కించి మంచి మార్కులు కొట్టేశాడు ఈ దర్శకుడు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఎంత సింపుల్ గా సినిమా తీశాడో.. అంతే సింపుల్ గా ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకున్నాడు.
కేవలం మాటలు, హీరో బాడీ లాగ్వేజీతోనే సినిమా హిట్ కొట్టొచ్చు అని నిరూపించాడు విమల్ కృష్ణ. ఆ సినిమా పేరే ‘డీజే టిల్లు’. ఇక టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఈ సినిమా స్టోరీ సాధారణమైనదే అయినప్పటికీ మాటలు, హీరో సిద్దూ మార్క్ యాక్టింగ్ తో సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టించాడు విమల్. ఇప్పటికీ ఈ మూవీలోని డైలాగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక మీమ్స్ లో అయితే డీజే టిల్లు డైలాగ్స్ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి.
అసలే డెబ్యూ డైరెక్టర్.. ఆపై ఎంచుకున్న కథ టైమ్ ట్రావెల్. ఇంకేముంది చాలా మంది సినిమా పోవడం ఖాయం అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తు.. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తిక్ కు తొలి సినిమానే అయినప్పటికీ టైమ్ ట్రావెలర్ కథను ఎంతో బ్యాలెన్స్ గా నడిపి విజయం సాధించాడు. శర్వానంద్ తో పాటుగా వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అమల, నాజర్ లాంటి అద్బుతమైన నటులు తోడుకావడంతో.. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక వీరితో పాటుగా మరికొంత మంది నూతన దర్శకులు తమ ప్రతిభను టాలీవుడ్ లపై ఎగరేశారు. అందులో చెప్పుకోదగ్గవారు హర్ష పులిపాక.. ‘పంచతంత్రం’ సినిమా ద్వారా ఓ అద్భుతమైన కథను వెండితెరపై ఆవిష్కరించాడు. మరో డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ.. బెల్లం కొండ సాయి గణేశ్ తో ‘స్వాతిముత్యం’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆద్యంతం ఎంతో ఆహ్లదకరంగా ఉండేలా ఈ సినిమాను తెరకెక్కించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. ఈ చిత్రానికి డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు. ముఖ్యంగా ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. వీరితో పాటుగా తమిల్ డబ్బింగ్ మూవీ అయిన ‘ఓరి దేవుడా’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ అయ్యాడు దర్శకుడు అశ్వంత్ మారిముత్తు. తమిల్ లో బిగ్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం పర్వాలేదనిపించింది. వీరే కాకుండా మరికొంత మంది డెబ్యూ డైరెక్టర్లు కూడా తమ ప్రతిభను నిరూపించుకోడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.