ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఒక స్టార్ హీరోయిన్ ఏకంగా రూ.10 లక్షలు ఖర్చు పెట్టేశారు. ఎవరా హీరోయిన్? ఆమె ఎందుకంత ఖర్చు పెట్టారంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి మ్యాచుల్లో ఉత్కంఠత తీవ్రస్థాయికి చేరింది. సీజన్ తొలి అంచెలో కొన్ని మ్యాచ్‌లు అయితే ఆడియెన్స్‌ను మునివేళ్లపై నిల్చొని చూసేలా చేశాయి. లీగ్ సెకండాఫ్ కూడా తక్కువేమీ కాదు. ప్లేఆఫ్స్‌కు ప్రతి మ్యాచ్ కీలకంగా మారడంతో అన్ని జట్లు తమ శక్తివంచన లేకుండా పోరాడాయి. ఈసారి ప్లేయర్ల బ్యాటింగ్ మెరుపులు, ఫీల్డింగ్ విన్యాసాలు, బౌలింగ్ అద్భుతాలతో పాటు గ్రౌండ్లో వివాదాలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. సౌరవ్ గంగూలీతో విరాట్ కోహ్లీ గొడవతో మొదలైన వివాదాల పరంపర.. ఆ తర్వాత గౌతం గంభీర్, నవీన్ ఉల్ హక్ వరకు వెళ్లింది. తొలుత గంగూలీతో అనంతరం గంభీర్, నవీన్‌తో వివాదాల్లో కోహ్లీ కేంద్రబిందువుగా మారాడు.
లీగ్ మ్యాచ్‌ల మాదిరిగానే ప్లేఆఫ్స్ కూడా ఉత్కంఠభరితంగా సాగాయి. టేబుల్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. హార్దిక్ సేన మాత్రం క్వాలిఫయర్-2లో ముంబై మీద నెగ్గాకే ఫైనల్ ఫైట్‌కు అర్హత సాధించింది. టైటిల్ ఫైట్‌కు అంతా సిద్ధమనుకున్న వేళ వర్షం రూపంలో అంతరాయం ఏర్పడింది. తుదిపోరుకు వేదికగా ఉన్న అహ్మదాబాద్‌లో వర్షం కురవడంతో మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి. పూర్తి మ్యాచ్ సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. దాంతో విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ అది కూడా కుదకపోతే గుజరాత్ టైటాన్స్‌ను విన్నర్‌గా ప్రకటిస్తారు.
సూపర్ ఓవర్ నిర్వహణ సాధ్యం కాకపోతే లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచినందున గుజరాత్ కప్ విన్నర్‌గా నిలుస్తుంది. మ్యాచ్ జరగాలా వద్దా అనేది ఇప్పుడు వరుణుడి చేతుల్లో ఉంది. ఇకపోతే, మన దేశంలో క్రికెట్‌ను ఇష్టపడని ఎవరుంటారా చెప్పండి? సీఎస్కే వర్సెస్ గుజరాత్ పోరును చూసేందుకు ఎందరో సెలబ్రిటీలు తరలివచ్చారు. వారిలో స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు. ఈ మ్యాచ్ కోసం ఆమె దాదాపు 20 టికెట్లు తీసుకున్నట్లు నెటిజన్స్ చెబుతున్నారు. ఒక్కో టికెట్ ధర రూ.50 వేలు వేసుకున్నా.. ఆమె దగ్గర ఉన్న టికెట్ల ధర రూ.10 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. సీఎస్కేపై అభిమానంతో ఒక మ్యాచ్‌కు ఏకంగా రూ.10 లక్షలు ఖర్చు పెట్టారట వరలక్ష్మీ. కాగా, ‘క్రాక్’, ‘నాంది’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో తెలుగు నాట ఆమె సూపర్ స్టార్డమ్ సంపాదించిన విషయం విదితమే.