ఆధునిక జీవన విధానంలో తరచూ ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో అత్యంత ప్రమాదకరమైంది గుండె పోటు. ఇప్పుడీ గుండె పోటు వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల్ని కూడా వెంటాడుతోంది. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు తప్పక కన్పిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏటా సంభవించే మరణాల్లో అత్యధికం గుండెపోటు కారణంగా ఉంటున్నాయి. గత కొద్దికాలంగా చిన్నారులు, టీనేజ్, యుక్త వయస్సువారిని కూడా టార్గెట్ చేస్తోంది. మరి ఈ గుండెపోటు సమస్య నుంచి రక్షించుకోవడం ఎలా అనేది అతిపెద్ద సమస్యగా మారింది. అయితే గుండె జబ్బు రావడానికి పదేళ్ల ముందే కొన్ని లక్షణాలు కన్పిస్తాయని, సకాలంలో గుర్తించగలిగితే చెక్ పెట్టవచ్చనేది అధిక శాతం వైద్యులు చెప్పే మాట.
గుండె జబ్బు రావడానికి పదేళ్ల ముందు నుంచే చాలామందిలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. తీవ్రమైన అలసట ఉంటుంది. అంటే త్వరగా అలసిపోతుంటారు. గుండె వేగంగా కొట్టుకోవడం గమనించవచ్చు. శ్వాస తీసుకోవడంలో అప్పుడప్పుడూ ఇబ్బంది ఉండవచ్చు. నెమ్మదిగా మీరు గమనించనంతగా బరువు పెరగవచ్చు. కొలెస్ట్రాల్, బీపీ వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. సాధారణంగా ఈ సమస్యల్ని తేలిగ్గా తీసుకుంటుంటారు. అదే మనం చేసే అతి పెద్ద పొరపాటు. ఈ ఈ తరహా లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో వైద్యుడిని సంప్రదించి తగిన వైద్య సహాయం తీసుకోవాలి.
గుండె వ్యాధులకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి
శారీరక శ్రమ ఉండాలి. దీనికోసం వాకింగ్, వర్కవుట్లు అవసరం. రోజూ కనీసం ఓ అరగంట కేటాయించాలి. ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండి మెరుగైన లైఫ్‌స్టైల్ అలవర్చుకోవాలి. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండాలి. సరైన నిద్ర అంటే రాత్రి వేళ 7-8 గంటలు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. వీలైనంతలో మెట్లు ఎక్కడం, నడవడం చేస్తుండాలి. కుటుంబంలో గుండె పోటు నేపధ్యం ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. రోజూ వర్కవుట్లు లేదా వాకింగ్ సాధ్యం కాకపోతే వారంలో ఓసారి 150 నిమిషాలు శ్రమ అవసరం. దీనికోసం వారంలో ఓరోజు శారీరక శ్రమని కల్గించే ఆట ఆడితే మంచిది.